Begin typing your search above and press return to search.

‘గులాబీ’ మదిలో:తెలంగాణకూ ఒక సొంత జెండా!

By:  Tupaki Desk   |   24 July 2017 7:56 AM GMT
‘గులాబీ’ మదిలో:తెలంగాణకూ ఒక సొంత జెండా!
X
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తమ రాష్ట్రానికి ఒక సొంత జెండా ఉండాలంటూ తీసుకున్న నిర్ణయం భిన్నాభిప్రాయాలకు వేదిక అవుతోంది. దేశానికి ఒక పతాకం ఉన్నప్పుడు - రాష్ట్రాలకు మళ్లీ వేరే పతాకాన్ని తయారు చేసుకోవడం తగని పని అంటూ కొందరు వాదిస్తున్నారు. అదే సమయంలో.. ఒక జాతీయ గీతం ఉన్నప్పుడు, రాష్ట్రగీతాలు కూడా ఉంటున్నాయి కదా... అలాగే రాష్ట్ర పతాకం కూడా ఉంటే తప్పేమిటి? అనే ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి.

అయితే సిద్ధరామయ్య కర్ణాటకకు కొత్త జెండా తయారు చేయించుకోదలచుకోవడం గురించి నిజానికి మనకు ఇంత చర్చ అనవసరం. అయితే... సిద్ధరామయ్యకు వచ్చిన ఆలోచనే ఇప్పుడు గులాబీ పార్టీ అధినేతలో మదిలో కూడా మెదలుతున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం అసమాన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సొంత పతాకం కూడా ఉంటే బాగుంటుందని తెరాస అగ్రనేతల్లో కొందరు భావిస్తున్నారట. అయితే ఇలాంటి ప్రతిపాదన ఏమైనా ప్రతికూల సంకేతాలు పంపిస్తుందా...సిద్ధరామయ్య జెండా పట్ల ఎలాంటి ప్రతిస్పందనలు వస్తాయో వేచిచూసి తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారట.

ఇలాంటి సమయంలో తాజాగా బెంగుళూరులో ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు - మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చెప్పిన సంగతి గులాబీ నాయకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శశిథరూర్ - కర్ణాటక సొంత జెండా ఆలోచనను సమర్థించారు. ఏ రాష్ట్రమైనా సరే తమకంటూ ఓ సొంత పతాకం తయారు చేసుకోదలచుకుంటే భారత రాజ్యాంగంలో అందుకు అభ్యంతరాలు ఏమీ లేవని థరూర్ చెప్పారు. ఆ మాటలు గులాబీ నేతలకు బలాన్నిస్తున్నాయి. ఎందుకంటే శశిథరూర్ రాజ్యాంగం మీద బాగా పట్టున్న నాయకుడు. అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల మీద కూడా పట్టున్న న్యాయవాది. ఇటీవల పాకిస్తాన్ లో భారతీయఖైదీకి ఉరిశిక్షపడితే.. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించింది ఆయనే. అందుకే ఆయన మాటలు వీరికి ప్రేరణ ఇస్తున్నాయి. మనం కూడా మన రాష్ట్రానికి ఒక సొంత జెండా పెట్టుకుందాం అనుకుంటున్నారట. తెరాస నాయకుల ఆలోచన కార్యరూపం దాలిస్తే.. ఈ రాష్ట్రానికి ఒక సొంత రాష్ట్రగీతం - రాష్ట్ర పతాకం అన్నీ ప్రత్యేకంగానే ఉండబోతున్నాయన్నమాట.