Begin typing your search above and press return to search.

ఆమె కారు కోసం.. ఊరికి రోడ్డొచ్చింది!

By:  Tupaki Desk   |   21 Oct 2016 11:46 AM GMT
ఆమె కారు కోసం.. ఊరికి రోడ్డొచ్చింది!
X
రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌ లకు క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన కానుకను మెయింటెన్‌ చేయలేక దీపా కర్మాకర్‌ తన కారును తిరిగి ఇచ్చేద్దామనుకుంటుందన్న వార్తలు కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించాయి. దీంతో త్రిపురలో రాజకీయాలు సైతం వేడెక్కాయి. ఇన్నాళ్లు కమ్యునిస్టుల పాలనలో రోడ్ల పరిస్థితి అలా ఉందని విమర్శలు మొదలైపోయాయి. దీంతో తేరుకున్న అగర్తలా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఆ రోడ్లపై మనసు పెట్టారు!

దీంతో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోసం, ఆమె కారు కోసం ఆమె ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్లు బాగు చేయిస్తున్నారు. కారణం ఏదైనా స్థానికంగా ప్రజలు మాత్రం ఖుషీగా ఉన్నారట. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం వాళ్లు తనకు ఇచ్చిన బీఎండబ్ల్యు కారును ఈ రోడ్లపై నడిపించడం ఏమాత్రం సాధ్యం కాదని, అందువల్ల ఆ కారును తిరిగి ఇచ్చేస్తానని ఆమె చెప్పిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా భావించిన అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రఫుల్‌జిత్ సిన్హా, అభోయ్‌నగర్ లోని దీపా కర్మాకర్ ఇంటిప్రాంతంలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఇంటి నుంచి అగర్తలా మెడికల్ కాలేజి వరకు ఉన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 78 కోట్లు కేటాయించినట్లు పీడబ్ల్యుడి శాఖ అధికారి ఒకరు తెలిపారు.

కనీసం బీఎండబ్ల్యూ కారు వల్ల అయినా తమ ఊరు రోడ్లు బాగుపడుతున్నాయని భావించిందో ఏమో కానీ ఈ విషయాలపై దీపా కర్మాకర్ స్పందించారు. తమ ఊరి రోడ్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతరం... నిజంగా మెయింటెన్ చేయలేకే బీఎండబ్ల్యూ కారు తిరిగి ఇచ్చేద్దామనుకున్నానని, కేవలం బీఎండబ్ల్యూ కారులో తిరగాలనే రోడ్ల గురించి తాను ఫిర్యాదుచేయలేదని, ఇదే సమయంలో రోడ్ల వెడల్పుతో పాటు నాణ్యత కూడా ముఖ్యమని ఆమె తెలిపింది. అయితే కేవలం రోడ్లే కారణం కాదు, వాటితో పాటు కారు నిర్వహణ, సర్వీసింగ్ లాంటివి కూడా ముఖ్యాంశాలని, అందుకే కారు వెనక్కి ఇవ్వాలనుకుంటున్నానని ఆమె తెలిపింది.