Begin typing your search above and press return to search.

తలాక్ చెప్పిన జడ్జిపై సుప్రీంలో కేసేసిన భార్య

By:  Tupaki Desk   |   13 Feb 2016 10:22 AM GMT
తలాక్ చెప్పిన జడ్జిపై సుప్రీంలో కేసేసిన భార్య
X
తలాక్ ను నోటిమాట ద్వారానే కాకుండా సోషల్ మీడియాలోనైనా మూడు సార్లు చెబితే విడాకులు ఇచ్చేసినట్లేనని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించడంపై ఓ ముస్లిం మహిళ పోరాటం మొదలుపెట్టారు. అందరికీ తీర్పులు చెప్పే తన భర్తే తనకు అన్యాయం చేశారంటూ ఓ జడ్జి భార్య ఈ పోరాటం ప్రారంభించారు. అంతేకాదు.... విడాకులకు విధానం లేకుండా నోటి మాటతో తలాక్ చెప్పేవారిని జైలుకు పంపాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా అదనపు న్యాయమూర్తి మొహ్మద్ సిద్ధిఖీ తన మొదటి భార్య చనిపోగా గత ఏడాది అష్ఫా ఖాన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అందరి ఆమోదంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు ఆయన. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం కూడా దీనికి అంగీకరించి వివాహానికి రావడంతో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారాయన. అయితే... మొన్నీమధ్య మొగుడూ పెళ్లాలకు ఏదో చిన్న విషయంపై గొడవ జరగ్గా జడ్డిగారు కోపంతో ఊగిపోతూ ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశారట. అక్కడితో ఆగకుండా తలాక్ చెప్పాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ ఇంట్లోంచి బయటకు గెంటేశారట. తనకు న్యాయం చేయాలంటూ అష్ఫా ఖాన్ సుప్రీం న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మతీన్ అహ్మద్ లకు లేఖ రాశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.