Begin typing your search above and press return to search.

యూపీ గెలుపు లాజిక్ చెప్పేసిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   19 March 2017 5:12 AM GMT
యూపీ గెలుపు లాజిక్ చెప్పేసిన కేంద్రమంత్రి
X
అనూహ్య రీతిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ భారీ మెజార్టీ సాధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఊహించ‌ని ప్ర‌జాద‌ర‌ణ‌, అందులోనూ ముస్లిం ఓట్లు ఎలా సాధ్య‌మ‌ని కొంద‌రు సందేహం వ్య‌క్తం చేశారు. ఇలాంటి సందేహాల‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘ట్రిపుల్ తలాఖ్’తో బాధపడుతున్న ముస్లిం మహిళలు బీజేపీకి ఉత్తరప్రదేశ్‌ లో మద్దతు పలికారని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ బాధితులైన మహిళలు ఉత్తరప్రదేశ్‌ లోనే ఎక్కువగా ఉన్నారని, వారు ఈ ఇబ్బందిక‌ర‌మైన సంప్ర‌దాయానికి వ్య‌తిరేకంగా బీజేపీకి ఓట్లు వేశార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యాలు చేశారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ప‌లువురు మ‌హిళ నేత‌లు సైతం ముస్లిం మ‌హిళ‌లు ఎదుర్కుంటున్న ట్రిపుల్ త‌లాక్ గురించి మాట్లాడ‌లేద‌ని కానీ బీజేపీ మాత్రం ధైర్యంగా త‌న విధానం చెప్పింద‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ విశ్లేషించారు. ఈ వ్యవహారం మతానికి సంబంధించింది కానే కాదని, లింగ వివక్షకు సంబంధించిందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ట్రిపుల్ తలాఖ్ అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కానీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కానీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కానీ తమ వైఖరిని వ్యక్తం చేయకపోవటం దురదృష్టం. వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌ లో ఉంది. ఇది మతపరమైన అంశం కాదు. ఇది లింగ వివక్షకు, స్ర్తి పురుష సమానత్వానికి, గౌరవానికి సంబంధించింది’ అని ఆయన స్పష్టం చేశారు. అంటరానితనం ఏ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనదో, మహిళల పట్ల ఎలాంటి వివక్షాపూరిత చర్య కూడా రాజ్యాంగానికి విరుద్ధమేనని కేంద్ర మంత్రి వివరించారు. ప్రపంచంలో 20 ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్ విధానానికి పరిమితులు విధించటమో, పూర్తిగా నిషేధించటమో చేశాయని ప్రసాద్ తెలిపారు. అయోధ్యలో చట్టబద్ధంగానే అద్భుతమైన రామమందిరాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్తుందని భావిస్తున్నట్లు ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/