Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు చుక్క‌లు చూపిస్తున్న మాజీ ఆప్తుడు

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:56 AM GMT
కేసీఆర్‌ కు చుక్క‌లు చూపిస్తున్న మాజీ ఆప్తుడు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను న‌మ్మిన‌బంటు ద్వారా తాజాగా చిక్కుల పాలు అవుతున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌చ్ఛ భార‌త్‌ కు ప్రాధాన్యం ఇస్తూనే అదే రీతిలో గ్రేటర్ హైద‌రాబాద్ ప‌రిధిలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్ర‌స్తుతం అబాసుపాలు అయ్యే స్థితిలో ఉంది. ఇదంతా జీహెచ్ ఎంసీ మాజీ క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్ నిర్వాకం వ‌ల్లే కావ‌డం గ‌మ‌నార్హం.

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో చెత్త తరలించడానికి 2,500 స్వచ్ఛ ఆటోలను ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. దీంతో నిరుద్యోగుల నుంచి జీహెచ్‌ ఎంసీ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే వీటి సంఖ్యను 2000కు కుదించారు. 4,107 మంది డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు పరిశీలన చేసి 3,717 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 1,307 మందికి ఆటో ట్రాలీలు ఇవ్వాలని జీహెచ్‌ ఎంసీ నిర్ణయించింది. మొదటి దశలో 1,005 ఆటోలను అందజేసింది అదే క్ర‌మంలో మరో 1000 ఆటోలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే లెక్క‌లు బాగానే ఉన్నా... ఆటోలు మాత్రం మూల‌న ప‌డి ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

ఏ మాన్యూఫాక్చరింగ్‌ కంపెనీ అయినా తయారుచేసే వాహనానికి సంబంధించిన డిజైన్‌ - ఇంజన్‌ - బాడీ - క్యారేజ్‌ అంతా రవాణశాఖ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అయితే స్వ‌చ్ఛ‌ ఆటోలకు సంబంధించిన వివ‌రాలు తమకు అందలేదని రవాణశాఖ అధికారులు చెబుతూ అనుమ‌తులు నిరాకరించారు. అయినా ప్రభుత్వమే చెప్పింది కదా అనుకున్నారో.. ఏమో కాని ఎలాంటి అనుమతి లేకుండానే డ్రైవర్లకు అందజేశారు.అయితే రిజిస్ట్రేషన్స్ లేక‌పోవ‌డంతో ని ఆటోలు ఇంతవరకు రోడ్డెక్కలేదు. పీపుల్స్‌ ప్లాజా నుంచి తీసి అంబర్‌పేట్‌ మైదానంలో పెట్టారు. ఒకవేళ ఈ ఆటోలు రోడ్డెక్కాలంటే రవాణశాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. సోమేశ్‌ కుమార్ నిబంధ‌న‌ల‌ను విరుద్ధంగా వ్యవహరించడం వ‌ల్లే నవంబర్‌ 9వ తేది నుంచి ఆటోలన్నీ అంబర్‌ పేట్‌ మైదానంలో ఉండిపోయాయ‌ని... త‌ద్వారా అప్పులు చేసి ఆటోల కోసం చెల్లించిన నిరుపేద డ్రైవర్లకు పూట గడవడమే కష్టంగా మారిందని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు స‌మ‌యంలో ఇది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామ‌మ‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.వెర‌సి ఈ ప‌రిణామం సీఎం కేసీఆర్ మంచి ఉద్దేశానికి ఇబ్బందిక‌రంగా మారుతుందని భావిస్తున్నారు.