Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాలో మరో ప్రమాదం - 10 మంది మృతి

By:  Tupaki Desk   |   15 Oct 2019 9:06 AM GMT
గోదావరి జిల్లాలో మరో ప్రమాదం - 10 మంది మృతి
X
అదో ప‌ర్యాట‌క ప్రాంతం.. ప్ర‌కృతి అందాల‌ను త‌నివితీరా చూద్దామ‌ని వెళుతున్న ప‌ర్యాట‌కులు కొంద‌రు.. త‌మ స్వ‌స్థలాల‌కు వెళుతున్న‌వారు మ‌రికొంద‌రు... అంద‌రు బ‌స్సులో ఎక్కి వెళుతుండ‌గా - అది అనుకోకుండా ప్ర‌మాదానికి గురైంది.. అంతే.. బ‌స్సు లోయ‌లోకి జారీ పడింది.. అంతే.. బ‌స్సులో ఒక‌టే ఆర్త‌నాదాలు.. కొంద‌రు బ‌స్సులోనే విగ‌త‌జీవుల‌య్యారు.. కొందరు తీవ్ర గాయాల‌తో బిక్క‌చ‌చ్చిపోయారు.. కొంద‌రు మామూలు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.. ఆ లోయంతా.. ప్ర‌యాణికులు ఆర్త‌నాదాల‌తో ప్ర‌తిధ్వ‌నించింది. ఇది తూర్పు గోదావ‌రి జిల్లాలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాద సంఘ‌ట‌న తీరు. ఈ సంఘ‌ట‌న చూసిన వారికి హృద‌య విదార‌క‌రంగా ఉంది ప‌రిస్థితి.

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా మధ్యదారిలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందగా - మరో పదిమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు - పోలీసులు ఘటనా స్థలాన్ని పర్య‌వేక్షిస్తున్నారు. కాగా.. ప్రయాణికులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మారేడుమిల్లి - చింతూరు రహదారి లోయలు - గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప‌రిస్థితి విష‌మంగా ఉన్న వారిలో మ‌రో ఇద్ద‌రు - ముగ్గురు కూడా బ‌తికడం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌యాణికులు మృత్యువాత ప‌డ‌టంతో లోయంతా ఆర్త‌నాదాల‌తో మారుమోగుతోంది. చ‌నిపోయిన‌ - గాయ‌ప‌డిన వారి ర‌క్తంతో టూరిస్టు స్పాట్ అంతా ర‌క్త‌సిక్తం అయింది.