Begin typing your search above and press return to search.

మోడీకి టఫ్ టైం స్టార్టయిందా..?

By:  Tupaki Desk   |   20 July 2017 11:02 AM GMT
మోడీకి టఫ్ టైం స్టార్టయిందా..?
X
2014 ఎన్నికల్లో అఖండ విజయం తరువాత కూడా ఎక్కడా పట్టుకోల్పోకుండా 2019 ఎన్నికల కోసం దూసుకుపోతున్న నరేంద్రమోడీకి కష్టకాలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. దేశంలో అంతర్గతంగా ఆయనకేమీ కష్టాలు రానప్పటికీ పొరుగు దేశాలు ఉమ్మడి వ్యూహంతో కయ్యానికి కాలు దువ్వుతుండడంతో మోడీకి ఇబ్బందులు మొదలవుతున్నాయి. పాకిస్థాన్ - చైనాలు కలిసికట్టుగా భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్ తో యుద్ధానికి... చైనాకు ధీటుగా నిలవడానికి రెడీగానే ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేసారి చుట్టుముడితే ఏం చేయాలన్న విషయంలోనే ఇంతవరకు మోడీ ప్రభుత్వం సరైన అంచనాలతో లేదు. పైగా దేశ రక్షణ మంత్రి పదవిని కొన్ని నెలలుగా అదనపు బాధ్యతలతోనే అరకొరగా నడిపిస్తున్నారు. జీఎస్టీ అమలులో తలమునకలుగా ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా ఉండడంతో ఆయన ఒక్క నిమిషం కూడా కాన్సట్రేట్ చేసే పరిస్థితులు లేవు. సరిగ్గా ఇదే అదనుగా చైనా - పాకిస్థాన్ లు రెండు వైపుల నుంచి యుద్ధానికి జబ్బలు చరుచుకుంటూ వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడంలో మోడీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేనప్పటికీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్లిష్టత తప్పదని అర్థమవుతోంది.

పాకిస్థాన్‌ - భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చెల‌రేగుతున్నాయి. ఓ వైపు చైనాతో మ‌రో వైపు పాక్‌ తో స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ మ‌రోసారి రెచ్చిపోతోంది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని నౌషెరా, మాంజికోట్ సెక్టార్ల‌లో పాక్ సైన్యం భీక‌రంగా కాల్పులు జ‌రుపుతోంది. పాక్ కాల్పుల దృష్ట్యా 85 పాఠ‌శాలలను మూసివేశారు. స్థానికుల‌ను భ‌ద్ర‌తాదళాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇటీవ‌లే పాకిస్థాన్‌ కు అమెరికా నుంచి నిధులు ఆగిపోవ‌డం, పాక్‌ ను అమెరికా ఉగ్ర దేశంగా గుర్తించ‌డం వంటి కార‌ణాల‌తో పాక్ కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. మ‌రోవైపు అమెరికాతో భార‌త్ స‌త్సంబంధాలు పెంచుకుంటుండ‌డంతో పాక్ కు మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో పాక్ సైన్యం మ‌రోసారి స‌రిహ‌ద్దు వ‌ద్ద రెచ్చిపోతోంది.

ఇదే సమయంలో చైనా కూడా మనతో ఏ క్షణాన యుద్ధానికి రెడీ అన్నట్లుగా ఉంది. సిక్కిం సెక్టార్‌ లోని డోక్లాం ప్రాంతంలో భారత సైనిక బలగాలతో ఏర్పడిన ప్రతిష్టంభన తర్వాత చైనా సైన్యం టిబెట్‌ లోని పర్వత ప్రాంతంలో భారీ ఎత్తు న మోహరించింది. వేలాది సైనిక వాహనాలను, వేలాది టన్నుల సైనిక పరికరాలను ఆ ప్రాంతానికి చైనా తరలిం చినట్లు రెడ్‌ఆర్మీ అధికారిక పత్రిక ప్రకటించింది. గత నెల నుంచి ఈ తరలింపు పనులు భారీ ఎత్తున రోడ్ - రైలు మార్గాల ద్వారా సాగుతున్నాయి. టిబెట్ పీఠభూమిలో మందుగుండు సామాగ్రితో ‘పీపుల్స్ ఆర్మీ’ బలగాలు భారీ సైనిక విన్యాసాలు జరుపుతున్నట్లు చైనా టీవీ చానళ్లలో ప్రసారమైంది. ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని సిసి టివి ఈ వారం ప్రకటించింది. ఆ ప్రాంతం వివాదాస్పదమైన డోక్లాం ప్రాంతానికి చేరువగానే ఉంది. వివాదా స్పద డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్ నిర్మాణం చేపట్టడాన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇటు చైనా, అటు పాక్ రెండూ ఒకేసారి దండయాత్రకు సిద్ధమవుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందన్నది సుస్పష్టం. మరి మోడీ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రెండు దేశాలకూ బుద్ధి చెప్పి ప్రజల్లో తన ఇమేజిని మరింత పెంచుకుంటారో లేదంటే దౌత్యంతో పరిస్థితులు చక్కదిద్ది తన తెలివితేటలను అంతర్జాతీయ సమాజానికి చాటుతారో చూడాలి.