Begin typing your search above and press return to search.

వాళ్లకు టికెట్లు..జేసీ పరిస్థితి ఏమిటి?

By:  Tupaki Desk   |   19 March 2019 6:56 AM GMT
వాళ్లకు టికెట్లు..జేసీ పరిస్థితి ఏమిటి?
X
తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాల్సిందే అని జేసీ దివాకర్ రెడ్డి పట్టు పట్టారు. అందుకు సంబంధించిన లొల్లి రెండేళ్ల నుంచి సాగుతూ ఉంది. తీరా నామినేషన్ల సమయానికి ఆ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది.

మొత్తం నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలి అనేది జేసీ కోరిక అయితే బాబు ఈ విషయంలో జేసీకి అనుకూలంగా వ్యవహరించలేదు. చివరకు తీవ్రంగా పట్టు పడితే - ఆ నలుగురినీ మార్చితే తప్ప తను పోటీ చేసేది ఉండదని జేసీ హెచ్చరించగా.. చివరకు ఇద్దరిని మాత్రమే మార్చారు చంద్రబాబు నాయుడు.

కల్యాణదుర్గం ఎమ్మెల్యే సీట్లో - శింగనమలలో జేసీ పంతం నెగ్గినట్టే. అయితే వీరిలో కల్యాణదుర్గం లో హనుమంతరాయ చౌదరి మీద తీవ్రమైన వ్యతిరకత ఉంది. దీంతో అక్కడ అభ్యర్థిని మార్చాల్సిందే అని చంద్రబాబు కూడా భావించారు ఆ పని చేశారు. ఏతావాతా శింగనమల్లో మాత్రమే జేసీ పంతం నెగ్గింది.

అయితే అనంతపురం అర్బన్ - గుంతకల్ లలో మాత్రం జేసీ పంతం నెగ్గలేదు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకూడదని - గుంతకల్ లో జితేంద్రగౌడ్ కు టికెట్ ఇవ్వకూడదనేది జేసీ పెట్టిన షరతులు. అయితే వీటిని బాబు లెక్క చేయలేదు!

చౌదరికి టికెట్ దక్కింది - జితేంద్రగౌడ్ కు కూడా టికెట్ దక్కింది. వీరితో జేసీ గొడవల సంగతి తెలిసిందే. చౌదరితో రోడ్డు మీద గొడవ పడ్డారు జేసీ వర్టీయులు. ఇక జితేందర్ గౌడ్ కూడా జేసీ మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. తమకు ఎమ్మెల్యే టికెట్ దక్కనీయకుండా ప్రయత్నించిన జేసీ అంటే.. వాళ్లకు ఏ రేంజ్ లో మంట ఉంటుందో చెప్పనక్కర్లేదు. అంతజేసీ తాము తెలుగుదేశం పార్టీలోని పాత వాళ్లు - జేసీ నిన్న మొన్న వచ్చిన వ్యక్తి అనే భావన ఉంది వారిలో. మొత్తానికి వ్రతం చెడింది - ఫలితమూ దక్కలేదు అన్నట్టుగా మారింది దివాకర్ రెడ్డి పరిస్థితి.