టీడీపీలో ‘కోట్ల’ చిచ్చు.. చల్లారేలా లేదు..

Fri Feb 15 2019 10:39:01 GMT+0530 (IST)

రాయలసీమలోని కర్నూలు ఎంపీ సీటుపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ లో కొనసాగిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడానికి పూర్తిగా సంకేతాలు వెలువడ్డాయి. త్వరలో ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కోట్ల సుజాత కూడా పార్టీలోకి వెళ్లనున్నారు. ఇన్నాళ్లుగా కోట్ల చేరిక వార్తలు రాగానే ఆయనను కాంగ్రెస్ నాయకులు బుజ్జగిస్తూ వచ్చారు.  దీంతో కోట్ల యూటర్న్ తీసుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించడంతో  ఇక టీడీపీలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల  తాజాగా అమరావతి వెళ్లి చంద్రబాబుతో మంతనాలు జరపడంతో పసుపు పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.ఇదిలా ఉండగా కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఏంటని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ తరువాత టీడీపీలో చేరారు. ఇప్పుడు కోట్ల చేరికతో ఆయనకు కర్నూలు  స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో తన పరిస్థితి ఏంటని రేణుక.. బాబును అడగనున్నారు. అయితే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటుతో సర్దిచెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో రేణుక సైలెంట్ గా ఉంటుందా..? లేక వేరే నిర్ణయం తీసుకుంటుందా..? అనేది చూడాలి.

కర్నూలు ఎంపీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో  టీడీపీ తరుఫున బిటి నాయుడు  రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఎంపీగా సీటు ఇస్తే బిటి నాయుడు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు గెలుపుపై నమ్మకం లేదు. అధిష్టానం కూడా బిటి నాయుడుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

ఇక సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య  కోట్ల సుజాత పోటీ చేసే నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డోన్ నుంచి  లేదా అలూరు నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డోన్ నుంచి కేఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోంది.  కోట్ల కేఈ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. దీంతో ఈ నియోజకవర్గ సీటు ఎవరికి ఇస్తారోనని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం  డోన్ నియోజకవర్గ ఇన్ చార్జిగా కేఈ ప్రతాప్ ఉన్నారు. దీంతో ఆ సీటు తనకే కావాలని ఆయన పట్టుబడుతున్నాడు.

ఒకవేళ చంద్రబాబు కోట్ల కటుంబాన్ని బుజ్జగించాల్సి వస్తే మాత్రం అలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాత  పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే అలూరు నియోజకవర్గంలోనూ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న వీరభద్రడు.. కోట్ల సుజాతకు టిక్కెట్టు కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఆమెకు టిక్కెట్టు కేటాయింపుపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. మొత్తం కోట్ల టీడీపీలో చేరికతో అసంతృప్తులు అసమ్మతులు టీడీపీ మొదలై కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు కకావికలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.