Begin typing your search above and press return to search.

ఆ నిర్ణయమే వారిని పడవ ప్రమాదంలో ముంచింది..

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:10 AM GMT
ఆ నిర్ణయమే వారిని పడవ ప్రమాదంలో ముంచింది..
X
పరామర్శకు వెళ్లిన ఆ కుటుంబం పరాయిలోకాలకు వెళ్లింది. తన సొంత జిల్లా కర్నూలులో బంధువులకు బాగాలేకపోవడంతో వారిని కలిసేందుకు విశాఖ నుంచి వెళ్లిన కుటుంబం తిరిగిరాలేదు. విశాఖలో వారికి బంధువులు ఎవరూ లేకపోవడంతో వీరి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆరా తీయలేదు. కానీ తాజాగా పడవ ప్రమాదంలో ఈ కుటుంబం కూడా మునిగిపోయిందని తెలిసి విశాఖలోని గాజువాక ఆలూరి టవర్స్ లో విషాదం అలుముకుంది.

విశాఖలోని గాజువాకలో గల ఆలూరి టవర్స్ లో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (38) కుటుంబం నివాసం ఉంటుంది.ఈయనకు భార్య స్వాతి - పిల్లలు విఖ్యాత - హన్సిక ఉన్నారు. మహేశ్వరరెడ్డి విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటాడు. సుమారు 80 ఫ్లాట్లున్న ఈ ఆలూరి టవర్స్ లో వీరి కుటుంబం అందరికీ చిరపరిచితమే.. విశాఖలో వీరికి బంధువులు ఎవరూ లేరు. వారం క్రితం బంధువులకు ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో తన సొంతూరు కర్నూలుకు ఓ వెహికల్ మాట్లాడుకొని మహేశ్వర్ రెడ్డి బయలు దేరారు..

అయితే ఒక్క నిర్ణయమే వీరి కుటుంబాన్ని చిదిమేసింది. కర్నూలు నుంచి వాహనంలో తిరిగి వస్తూ పాపికొండలు చూడడానికి మహేశ్వరరెడ్డి ఫ్యామిలీ నిర్ణయించుకుంది. గోదావరి తీరంలో వాహనం పార్క్ చేసి బోటు ఎక్కారు. ఆ బోటే ఆదివారం గోదావరిలో మునిగింది. వీరి కుటుంబం మొత్తం జలసమాధి అయిపోయింది.

మహేశ్వరరెడ్డికి బంధువులు ఎవరూ విశాఖలో లేకపోవడంతో వీరి గురించి ఎవరూ ఆరాతీయలేదు. తాజాగా మహేశ్వర్ రెడ్డి డెడ్ బాడీ దొరకడం.. ఆలూరి అపార్ట్ మెంట్ వాసులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ఆ గృహ సముదాయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలతో పచ్చని సంసారంగా ఉన్న మహేశ్వరరెడ్డి ఫ్యామిలీని పడవ ప్రమాదం కాటేసిందన్న వార్త తెలిసి స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. బంధువులకు బాగా లేదని తెలిసి తిరుగు ప్రయాణంలో వీరు పాపికొండలకు వెళ్లడమే వీరి చేసిన పెద్ద తప్పుగా అభిప్రాయపడుతున్నారు.