ఏపీలో ఓటర్లు తేలారు...ఫలితమే పెండింగ్

Sun Jan 13 2019 10:39:37 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్లు ఎందరో తేలిపోయింది. వర్గాల వారీగా..... జెండర్ అనుసరించి ఓటర్ల జాబితాకు తుది రూపం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 36933091 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సమైఖ్య రాష్ట్రంలో ఆరు కోట్ల ఆంధ్రులు అని ప్రతి ఒక్కరూ పిలుచుకున్నది ఈ జాబితాతో నిజమే అయ్యింది. రాష్ట్రం విడిపోయాక ఆరు కోట్లలో సగం మంది అంటే మూడు కోట్ల కంటే ఎక్కువ మందే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదయ్యారు. అది కూడా దగ్గర దగ్గర నాలుగు కోట్లకు చేరుకుంది. ఈ నాలుగు కోట్ల మంది ఓటర్ల లెక్క తేలింది. ఇక తేలాల్సింది 2019 శాసనసభ ఎన్నికల్లో విజయం ఎవరిదో అనేదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్లలో పురుషులు 18324 588 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1 8604742 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కు చెందిన వారు 3761 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 4013770 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్ప ఓటర్ల ఉన్న జిల్లాగా విజయనగరం జిల్లా ఉంది. ఇక్కడ 1733667 మంది ఓటర్లు ఉన్నారు.ప్రతి జిల్లాలోనూ సగటున 20 లక్షలకు మించి ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2064330 మంది. విశాఖపట్నం జిల్లాలో 3280028 - పశ్చిమ గోదావరి జిల్లాలో 3057922 - క్రిష్ణ జిల్లాలో 3303592 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో 3746072 మంది ఓటర్లు - ప్రకాశం జిల్లాలో 2495383 మంది - నెల్లూరు జిల్లాలో 2206652 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ జిల్లాలో కూడా ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 2056660 మంది ఓటర్లు - కర్నూలు జిల్లాలో 2890884 మంది ఓటర్లు - అనంతపురంలో 3058909  మంది - చిత్తూరు జిల్లాలో 3025222 మంది ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో వారి ఓట్లు ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తేలింది. ఇక తేలాల్సింది ఎన్నికల్లో ఫలితమే అని అంటున్నారు.