Begin typing your search above and press return to search.

న‌క్స‌లైట్ల వ్యాపారాలు చూసి హోం శాఖ షాక్!!

By:  Tupaki Desk   |   8 May 2018 2:05 PM IST
న‌క్స‌లైట్ల వ్యాపారాలు చూసి హోం శాఖ షాక్!!
X
స‌హ‌జంగా న‌క్స‌లైట్లు అదే ప్ర‌స్తుతం మావోయిస్టులు అంటే అడ‌వుల్లో ఉంటూ..తాడిత, పీడిత ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసు్తుండే వారు. వారికంటూ సొంతంగా ఏమీ ఉండ‌దు. కానీ తాజాగా కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ నివేదిక సంచ‌లన విష‌యాల‌ను వెల్ల‌డిస్తోంది. నిరుపేదల సమస్యల కోసం పోరాడుతున్న నక్సలైట్లు కోటీశ్వరులుగా అవతారమెత్తుతున్నారని, తమ వారి చదువులకు భారీగా ఫీజులు చెల్లిస్తున్నారని వివ‌రించింది. నక్సలైట్లు పెద్దమొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నారని, ఇదంతా దోపిడీ సంపాదనేనని హోంశాఖ చెబుతున్నది. కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం.. పలువురు నక్సలైట్లు కోటీశ్వరులుగా ఎదగ్గా - మరికొందరు తమ కుటుంబీకుల ఉన్నత చదువుల కోసం లక్షల్లో ఖర్చుచేస్తున్నారని నివేదిక వెల్ల‌డించింది.

మావోయిస్టు పార్టీ బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ (బీజేఏఎస్) సభ్యుడు ప్రద్యుమ్నకుమార్.. మేనకోడలుకు స్థానిక వైద్య కళాశాలలో అడ్మిషన్‌ కు రూ.22 లక్షలు చెల్లించగా - ఇదే బీజేఏఎస్ సభ్యుడు సందీప్ యాదవ్ తన కుమారుడు - కూతురుకు స్థానిక ఇంజినీరింగ్ కాలేజీ - ప్రైవేట్ విద్యాసంస్థలో డొనేషన్లతో అడ్మిషన్లు ఖరారు చేసుకున్నాడు. మరో సీనియర్ నేత అరవింద్ యాదవ్ తన సోదరుడికి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సీటుకు రూ.12 లక్షలు చెల్లించాడు. పెద్దనోట్ల రద్దు సమయంలో సందీప్ యాదవ్ సుమారు రూ.15 లక్షలు నగదు మార్చుకున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈయనకు రాంచీ లో రూ.30 లక్షల విలువచేసే ఫ్లాట్ ఉన్నదని, రియాల్టీలో సుమారు రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. సందీప్‌ కుమార్‌ కు చెందిన రూ.1.45 కోట్ల విలువచేసే నగదును - ఆస్తులను ఈడీ సీజ్ చేసింది అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రద్యుమ్నకుమార్‌ పై 51 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈయనా సుమారు రూ.37 లక్షల విలువచేసే భూములు కలిగివున్నాడని ఆ నివేదిక పే ర్కొంది. ప్రద్యుమ్నకుమార్ - సందీప్ - వినయ్ - ముసాఫిర్ సాహ్నిలపై మనీలాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది.

కాగా, ఈ డ‌బ్బుల విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను హోం శాఖ వెల్ల‌డించింది. కాంట్రాక్టర్లు - రవాణాదారులు - పారిశ్రామికవేత్తలను బెదిరించి నక్సలైట్లు భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని కేంద్ర హోంశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. అనధికార మైనింగ్ - స్టోన్ క్రషింగ్ - తెండు పట్టాదారులను భయపెట్టి దోచుకుంటున్నారంటున్నారు. పిల్లల్ని దళంలో చేరేలా ప్రోత్సహిస్తూ వారిని చదువులకు దూరం చేస్తున్న నక్సలైట్లు.. తమ వారి ఉన్నతంగా చదువుకోవాలని ప్రైవేట్ కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. ఇది నక్సలైట్ల ద్వంద్వనీతిని బయటపెడుతోంన్నది. పేదల ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని కేంద్ర హోంశాఖ అధికారులు విమర్శిస్తున్నారు. నక్సల్స్‌కు సమకూరే వనరులను దెబ్బ తీసేందుకు కేంద్రం వివిధ భద్రతా సంస్థలు, రాష్ర్టాల పోలీసు అధికారులతో బహుళ క్రమశిక్షణా గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ గ్రూపునకు ఆ నక్సల్స్ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటైన కమిటీలో ఐబీ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ - ఎన్ ఐఏ - సీబీడీటీ - సీబీఐ - రాష్ర్టాల నిఘా - సీఐడీ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ విభాగం మావోల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి వారి ఆర్థిక వ‌న‌రుల‌పై దెబ్బ కొట్టే ఎత్తుగ‌డ‌ల‌ను అమ‌లు చేస్తోంది.