Begin typing your search above and press return to search.

బాబు - కేసీఆర్‌ - జ‌గ‌న్ - క‌న్నా కలిసి సృష్టించిన రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   15 May 2018 6:14 PM GMT
బాబు - కేసీఆర్‌ - జ‌గ‌న్ - క‌న్నా కలిసి సృష్టించిన రికార్డ్ ఇది
X
నారా చంద్ర‌బాబు నాయుడు.....సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు.... ప్ర‌త్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకొని స్వ‌రాష్ట్రం సాధించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన నాయ‌కుడు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడైన ఈ యువ‌నేత ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌...మాజీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో సుప‌రిచితుడైన కాపు సామాజివ‌ర్గ నాయ‌కుడు. ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు. ఈ న‌లుగురికి గురించి ప‌రిచ‌యం ఎందుకు? వీరి గురించి తెలియ‌నిది ఎవ‌రికి అని ఆలోచించ‌కండి. ఈ న‌లుగురు...వివిధ పార్టీల్లో ఉన్నా...వివిధా హోదాల్లో, ప్రాంతాల్లో ఉన్నా...వీరంతా క‌ల‌గ‌లిసి..ఓ ప్ర‌త్యేక‌మైన ఇంకా చెప్పాలంటే చారిత్రాత్మ‌క‌మైన రికార్డ్ సృష్టించారు.

ఇంత‌కీ ఆ ప్ర‌త్యేక‌మైన...చారిత్ర‌క‌మైన రికార్డ్ ఏంట‌నే క‌దా మీ సందేహం. అక్క‌డికే వ‌స్తున్నాం...ఈ న‌లుగురు నాయ‌కులు ప్ర‌స్తుతం ప్ర‌ముఖ‌మైన స్థానాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ...భారీ క్యాడ‌ర్‌కు నాయ‌కులుగా చెలామణిలో ఉన్నప్ప‌టికీ...ఈ న‌లుగురు నేత‌ల మూలాలు ఒకే పార్టీలో ఉన్నాయి. అదే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పేరున్న కాంగ్రెస్ పార్టీ. ఔను ఈ న‌లుగురు నేత‌ల ``రాజ‌కీయ పుట్టుక‌``కాంగ్రెస్ పార్టీలోనే. అలా హ‌స్తం నీడ నుంచి వ‌చ్చిన చంద్ర‌బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు వేర్వేరు పార్టీలు ఇంకా చెప్పాలంటే ప‌ర‌స్ప‌ర భిన్న‌మైన సిద్ధాంతాల పార్టీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ న‌లుగురిలో సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు గురించి మొద‌టగా తెలుసుకుంటే...బాబు రాజ‌కీయ అరంగేట్రం కాంగ్రెస్ ద్వారానే జ‌రిగింద‌నే విష‌యం తెలిసిందే. ఆ పార్టీ ద్వారా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన బాబు అనంత‌రం ఓట‌మి పాల‌యి త‌నకు పిల్ల‌నిచ్చిన మామ అయిన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. త‌ద‌నంత‌రం ఆ పార్టీని కైవ‌సం చేసుకొని ప్ర‌స్తుతం ఏక‌చ‌త్రాధిప‌త్యం సాగిస్తున్నారు. ఇక మ‌రో ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి అయిన కేసీఆర్ పొలిటిక‌ల్ కెరీర్ స్టార్ట్ అయింది కూడా కాంగ్రెస్‌లోనే. యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుడిగా రంగప్రవేశం చేసిన కేసీఆర్ అనంత‌రం సినీన‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ పార్టీని ప్రారంభించ‌డంతో టీడీపీలో చేరారు. త‌ర్వాత ప్ర‌త్యేక తెలంగాణ ఎజెండాను ఎత్తుకొని త‌న ప్ర‌యాణం ప్రారంభించిన ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఇక ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ జీవితం ప్రారంభ‌మైంది కాంగ్రెస్‌లోనే. దివంగ‌త వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌న్ రాజకీయ రంగ ప్ర‌వేశం చేశారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీతో వివిధ కార‌ణాల వ‌ల్ల పొస‌గ‌క త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీ స్థాపించి గ‌త ఎన్నిక‌ల్లో తృటిలో అధికారం కోల్పోయి...ఇప్పుడు ఆ పీఠం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి ఇటీవ‌లే ఆ పార్టీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌తలు స్వీక‌రించిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పొలిటిక‌ల్ కెరీర్ గురించి పరిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితం కాంగ్రెస్‌లోనే సాగింది. స్థూలంగా....తెలుగు రాష్ర్టాల్లో నాలుగు కీల‌క‌మైన పార్టీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నేత‌ల‌ రాజ‌కీయ జీవితం మొద‌లు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇప్పుడు రెండు రాష్ర్టాల్లోనూ ప‌రిస్థితులకు ఎదురీదుతుండ‌టం అస‌లైన ట్విస్ట్‌.