Begin typing your search above and press return to search.

టాప్ 5: ఏపీలో భారీగా ఖర్చు ఆ లోక్ సభ సీట్లలోనే?!

By:  Tupaki Desk   |   23 April 2019 7:30 PM GMT
టాప్ 5: ఏపీలో భారీగా ఖర్చు ఆ లోక్ సభ సీట్లలోనే?!
X
ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులు కూడా భారీగా ఖర్చులు పెట్టుకున్నారనే అంచనాలున్నాయి. ఏపీలో జరిగిన అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా ఈ సారి ఎన్నికలు నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అత్యంత భారీ వ్యయం అయిన లోక్ సభ నియోజకవర్గాల జాబితా ఇలా ఉంటుందని అంచనా..

గుంటూరు

ఏపీలో అత్యధిక వ్యయం అయిన లోక్ సభ నియోజకవర్గంలో గుంటూరు నంబర్ వన్ పొజిషన్లో నిలవొచ్చు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇక్కడ మల్టీ మిలియనీర్ పోటీలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థికంగా గట్టి అభ్యర్థినే బరిలో నిలిపింది. దీనికి తోడు ఈ ఎంపీ సీటు పరిధిలోనే మంగళగిరి నియోజకవర్గం ఉంది. అక్కడ నుంచి లోకేష్ పోటీలో ఉండటం.. అక్కడ భారీగా ఖర్చు అయ్యిందనే అంచనాలున్నాయి. దీంతో గుంటూరు రాష్ట్రంలోనే అత్యధిక వ్యయం అయిన లోక్ సభ సీటుగా నిలుస్తోందని పరిశీలకులు అంటున్నారు.

విశాఖపట్టణం..

ఇక్కడ నుంచి కూడా ప్రముఖులు పోటీలో ఉన్నారు. అది కూడా చతుర్ముఖ పోటీ. తెలుగుదేశం అభ్యర్థి భరత్ ఆర్థిక శక్తి భారీగా ఉందనేది అందరికీ అవగాహన ఉన్న అంశమే. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా డబ్బులున్న ఒక వ్యాపారిని బరిలోకి దించింది. ఈ నేపథ్యంలో విశాఖ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ..ఈ ఎంపీ సీట్లో భారీగా ఖర్చు పెట్టారనే అంచనాలు మాత్రం ఉన్నాయి.

రాజమండ్రి..

ప్రతి దఫాలోనూ రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తిదాయకమైన అంశమే. ఈ సారి మురళీ మోహన్ కోడలు రూప ఇక్కడ నుంచి పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్గాని భరత్ రామ్ ను పోటీలో నిలిపింది. ఇరు వర్గాలూ ఆర్థికంగా ఢీ అంటే ఢీ అన్నాయని సమాచారం.

అనంతపురం…

ఈ నియోజకవవర్గంలో ఖర్చుల వ్యవహారం గురించి జేసీ దివాకర్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు. ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు. ఒక లోక్ సభ సెగ్మెంట్లో ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వడం అంటే ఖర్చు ఎంత అయి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. కనీసం పదిహేను లక్షల ఓట్లు ఉంటాయి. వాటిల్లో మెజారిటీ ఓట్లకు నోట్ల పంపకం జరిగే ఉంటుంది. కాబట్టి.. ఎంత ఖర్చు పెట్టి ఉంటారో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.

విజయవాడ…

తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయనే ఈ నియోజకవర్గంలో ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కోటీశ్వరుడిని తెచ్చి పోటీ చేయించింది. ఈ నియోజకవర్గంలో కూడా ఇరు వర్గాలనూ భారీగానే ఖర్చు పెట్టి ఉంటాయనే అంచనాలున్నాయి.