Begin typing your search above and press return to search.

టాప్ 5: ఈ సీట్లు టీడీపీకి ప్రతిష్టాత్మకం!

By:  Tupaki Desk   |   25 April 2019 6:11 AM GMT
టాప్ 5: ఈ సీట్లు టీడీపీకి ప్రతిష్టాత్మకం!
X
రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలవడమే కాదు.. కొన్ని సీట్లలో విజయం మరింత ప్రతిష్టాత్మకంగా నిలుస్తూ ఉంటుంది. ప్రతి సారి ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితి కొన్ని సీట్ల విషయంలో అయినా ఉంటుంది. అందుకు ఈ సారి కూడా మినహాయింపు కాదు. పార్టీల వారీగా కొన్నిసీట్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిల్లో గెలవడానికి ఆయా పార్టీలు తీవ్రంగా కష్టపడ్డాయి. అన్ని అవకాశాలనూ ఉపయోగించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో అలాంటి జాబితా ఇది…

మంగళగిరి: తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా ప్రతిష్టాత్మకమైన సీటు మంగళగిరి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ విజయం తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్ని కూడా నిర్దేశించబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి లోకేష్ ను భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో మంగళగిరిలో ఆయన నెగ్గకపోతే అంతే సంగతులు. అందుకే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి.. గెలుపుకోసం అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంది. విజయం విషయంయలో టీడీపీ ధీమాగా ఉంది. అయితే అసలు కథ ఏమిటో.. మే ఇరవై మూడున తేలాల్సిందే!

నెల్లూరు అర్బన్: టీడీపీకి పార్టీ పరంగా కాదు కానీ - ఇక్కడ నుంచి పోటీలో ఉన్న టీడీపీ నేత నారాయణకు మాత్రం ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకం. అసలు ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందే ప్రతిష్టకు పోయి అంటారు పరిశీలకులు. ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఆయనకు ఏమీ లేదు. ఎంచక్కా నామినేటెడ్ పదవితో సర్దుకోవచ్చు. అయినా ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి - విజయం కోసం తీవ్రంగానే కష్టపడ్డారు. మరి అందుకు ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

కుప్పం: ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయానికి ఢోకా అయితే లేదు. కానీ మెజారిటీ ఈ సారి కీలకం కాబోతోంది. చంద్రబాబు నాయుడు మరో టర్మ్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి కుప్పంలో మెజారిటీ ఎంత వస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. ఈ సారి కుప్పం విషయంలో తెలుగుదేశం వాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి సైతం రంగంలోకి దిగి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి కుప్పంలో బాబుకు ఎంత మెజారిటీ వస్తుందనేది ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది.

రాప్తాడు: పరిటాల రవీంద్ర ను తెలుగుదేశం పార్టీ వీరాభిమానులంతా హీరోలుగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు పరిటాల కుటుంబం ప్రతిష్టకు రాప్తాడు పరీక్షగా మారింది. అందుకే అక్కడ వారు తీవ్రంగా కష్ట పడ్డారు. అమీతుమీ తేల్చుకునేందుకు అన్ని అస్త్రాలనూ ఉపయోగించారు. పోలింగ్ కు ముందు వీడియోల్లో కూడా కొన్ని వ్యవహారాలు బయటపడ్డాయి. కేవలం పరిటాల కుటుంబానికే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు కూడా రాప్తాడు ఫలితం పరీక్షగా నిలవబోతూ ఉంది.

సత్తెనపల్లి: స్పీకర్ హోదాలో కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. స్పీకర్ గా ఉన్నప్పటికీ కోడెల రాజకీయ ప్రకటనలకు వెనుకడుగు వేయలేదు. ఇక పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు సత్తెనపల్లిలో ఎన్నికల పోరు ఏ స్థాయిలో జరిగిందో తెలియజేస్తూ ఉన్నాయి. అక్కడ విజయం కోసం అమీతుమీ ఎలా తలపడ్డారో తెలియజేస్తున్నాయి పోలింగ్ నాటి వీడియోలు. ఇలాంటి సీట్లో విజయమా, పరాజయమా అనేది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు సవాల్ గా మారింది.

ఇప్పటికే పోలింగ్ పూర్తి అయ్యింది. ఇలాంటి ప్రతిష్టాత్మక సీట్లలో ఫైట్ తీవ్రంగా సాగింది. ఈ నియోజకవర్గాల ఫలితాలు చాలా కాలం పాటు చర్చలో ఉండబోతూ ఉన్నాయి. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేదే ఆసక్తిదాయకమైన అంశం.