Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలందరికీ ఈ నీరేనట..

By:  Tupaki Desk   |   21 Jun 2018 1:30 AM GMT
టాలీవుడ్ హీరోలందరికీ ఈ నీరేనట..
X

ప్రపంచంలోనే స్వచ్ఛమైన తాగునీరు ఎక్కడ లభిస్తుంది అని ఆరాతీస్తే హిమాలయాల్లో అని ఒక పరిశోధన తేల్చింది. అంతటి స్వచ్ఛమైన నీరు తాగితే ఏ రోగాలు రావని.. చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని తేల్చారు. కానీ ఇప్పుడు మనం వాడుతున్న నీరు ఏమాత్రం ఆరోగ్యకరం కాదు.. మున్సిపాలిటీ నీళ్లలో మలినాలు ఎక్కువ. అదే ఫిల్టర్ వాటర్ లో మలినాలు శూన్యం. ఇక రోజురోజుకు ఎండలు మండిపోతుండడంతో నీరు కరువై జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో ఓ వాల్టర్ ఫిల్టర్ ఉంటోంది. ఇక నీళ్ల వ్యాపారం సంగతి చెప్పనక్కర్లేదు.

ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన తాగునీటిని అందించే మెషిన్ ను తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేసింది. దాని ధర రూ.4 లక్షలు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఈ నీరు తాగితే ఇనుమడిస్తుందని ఆ కంపెనీ ప్రచారం చేసింది. దీంతో ఈ మెషీన్లకు డిమాండ్ ఏర్పడింది.

జపాన్ కంపెనీ తయారు చేసిన ఈ మెషీన్ల పేరు ‘అయనైజర్ వాటర్ ఫిల్టర్ మెషిన్’ అంటారు. ఇవి ఇప్పుడు హైదరాబాద్ లోని సంపన్నుల ఇళ్లలో దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ లోనే అందమైన స్టార్ హీరో కోసం ఆయన భార్య జపాన్ నుంచి 4 అయనైజర్ వాటర్ ఫిల్టర్ మెషీన్లను తెప్పించిందట.. తాగునీటి నుంచి స్నానం వరకూ ఈ నీటినే ఆ హీరో వాడుతాడట.. వీరిని చూసి ఇటీవలే పాత కాలం కథతో హిట్ కొట్టిన హీరో భార్య కూడా ఓ మెహీన్ ను కొని తెప్పించిందట.. ఇలా చాలా మంది హీరోలు - హీరోయిన్లు - చోటామోటా నటులు - గాయకులు కూడా ఈ మెషీన్ల కోసం ఎగబడుతున్నారట.. ఉన్నత ప్రమాణాలతో తాగునీటిని అందించడం ఈ అయనైజర్ యంత్రాల ప్రత్యేకత కావడంతో దీనికోసం ప్రముఖ పారిశ్రామిక వేత్తలు - కోటీశ్వరులు పోటీపడుతున్నారట.. ఇలా ఇప్పుడు ‘అయనైజర్ వాటర్ మెషీన్ల’ వ్యాపారం జోరుగా జరుగుతోంది.