అట్నుంచి నరుక్కు వస్తున్న కమలదళం!

Wed Apr 11 2018 20:00:01 GMT+0530 (IST)

కాంగ్రెస్  పార్టీ తనను చిన్న చూపు చూస్తున్నదని అలిగి కమలదళంలో చేరిన కీలక నాయకుడు.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాంఛి కాక మీద ఉన్న తరుణంలో విదేశాల్లో గడుపుతూ ఎందుకు మిన్నకుంటారు? సరిగ్గా ఈ ఒక్క పాయింటు చాలు.. ఆయన ప్రస్తుతం ఉన్న భాజపా మీద కూడా అలకపూని ఉన్నారని ప్రజలు అర్థం చేసుకోవడానికి..! కానీ కమల నాయకులు మాత్రం.. ఆయన తమ పార్టీతో పూర్తి సఖ్యతతోనే ఉన్నారంటూ.. ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా.. కర్నాటక ఎన్నికల బరిలో క్షణక్షణానికి మారుతున్న పరిణామాలకు సంబంధించిన సంగతి.కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి మాజీ సీఎం కూడా అయిన ఎస్ ఎం కృష్ణను ఇటీవల భాజపాలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ లో తనస్థాయి గౌరవం దక్కట్లేదని ఆయన ఈ పార్టీలోకి వచ్చారు. తీరా ఇక్కడకూడా తనను గౌరవించడం లేదని ఆయనకు అలక వచ్చింది. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటూ పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ పుకార్లను ఆయన ఖండించడం కూడా జరిగింది.

కాకపోతే.. కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో కృష్ణ ప్రభావం బాగా ఉంటుందనే ఉద్దేశంతో.. కమలనాయకులు ఆయనను దువ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్న ఆయన త్వరలోనే వచ్చి ఎన్నికల పనుల్లో నిమగ్నం అవుతారని చెబుతున్నారు. అలాగే ఎస్ఎం కృష్ణకున్న ఇద్దరు కూతుళ్లలో ఎవరు పోటీచేయాలన్నా సరే.. మాండ్య జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా వారికి టికెట్ ఇస్తాం అంటూ తాయిలాలు ఆఫర్ చేస్తున్నారు.

అంటే.. ఎస్ ఎం ఉద్దేశాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఆయన వారసులైన కుమార్తెలకు టికెట్లు ఇస్తామని ప్రకటించడం ద్వారా.. వారి నుంచి ఆయన మీద ఒత్తిడి తేవడానికి పార్టీ మారకుండా బ్రేకులు వేయడానికి కమలదళం ఓ వ్యూహం ప్రకారం కదులుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా ఎస్ ఎం కృష్ణను బుజ్జగించడం తమకు చేతకాకపోతే గనుక.. కూతుళ్లనుంచి ఒత్తిడి తేవడానికి ఈ ప్లాన్ తో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.