Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే.. అందరికీ హేపీ !

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:30 PM GMT
ఇలా చేస్తే.. అందరికీ హేపీ !
X
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇతర మతాలకు చెందిన వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారు? అనేది ఇటీవలి కాలంలో చాలా పెద్ద సీరియస్ చర్చగా మారిపోయింది. ఎన్నో దశాబ్దాలుగా ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కాషాయప్రభావం దేశంలో అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్చ రావడం సహజం. మసీదుల్లో - చర్చిల్లో హిందువులకు ఎలాంటి ఉద్యోగాలకు అవకాశం లేనప్పుడు.. టీటీడీలో మాత్రం ఇతర మతాల వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారనేది ప్రశ్న. హిందుత్వ వాదుల కోణంలోంచి ఇది సబబైన చర్చే అనిపిస్తుంది.

దాన్ని పురస్కరించుకుని టీటీడీ 45 మంది ఉద్యోగులకు ‘మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదో చెప్పా’లంటూ నోటీసులు ఇచ్చింది. వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి.. తాము మళ్లీ చెప్పే దాకా వారందరినీ కొనసాగించాల్సిందే అని తీర్మానించింది.

అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఇతర మతాల వారికి ఉద్యోగాలు ఇవ్వడం వలన .. ధర్మానుచరణ నిబంధనల్లో కొంత ఇబ్బందులు తలెత్తుతుండవచ్చు. అయితే అందుకు టీటీడీ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నిబంధనలనే సవరించుకోవాలి.. కొత్తగా అలాంటి పని జరగకుండా చూసుకోవాలే తప్ప.. ప్రస్తుతం ఉన్నవారిని ఉద్యోగాల్లోంచి తొలగించడం కరెక్టు కాదని పలువురు వాదిస్తున్నారు.

అయితే టీటీడీ ఓ చర్య తీసుకుంటే ఉభయతారకంగా ఉంటుందని కూడా వాదిస్తున్నారు. ఇతర మతాలకు చెందిన వారిగా గుర్తించిన ఉద్యోగులను భగవత్సేవతో నిమిత్తం లేని టీటీడీ విభాగాల్లో ఉద్యోగాల్లోనికి బదిలీచేస్తే సరిపోతుందనే వాదన ఉంది. టీటీడీ నిర్వహణలో ఆసుపత్రులు - కళాశాలలు - హాస్టళ్లు అనేకం నడుస్తున్నాయి. భగవంతునికి హిందూ ధర్మం ప్రకారం ఆచార సాంప్రదాయాల సేవలు నిర్వర్తించాల్సిన వ్యవహారాలతో నిమిత్తం లేని కొలువుల్లోకి వారిని బదిలీచేస్తే.. ఉద్యోగాల్లోంచి తొలగించి పొట్ట మీద కొట్టినట్టుగా కాకుండా.. మానవతా దృక్పథంతో వ్యవహరించినట్లు ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

అదే సమయంలో ఇకమీదట అలాంటి హిందూయేతర మతాల వారికి ఉద్యోగాలు దక్కకుండా ఉండేలా.. నిబంధనలను సవరించుకుంటే.. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఉంటాయని పలువురు భావిస్తున్నారు.