ఇద్దరు సీఎంల కలలు కళ్లలే..కన్నడలో హంగ్

Tue Apr 24 2018 10:04:23 GMT+0530 (IST)

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే వెల్లడించింది. జనతాదళ్ (ఎస్) అధినేత హెచ్ డీ కుమారస్వామి ఎటువైపు మొగ్గితే ఆ పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా - అధికార కాంగ్రెస్ కు 91 - ప్రతిపక్ష బీజేపీకి 89 సీట్లు వస్తాయని తమ సర్వే అంచనాలను సోమవారం వెల్లడించింది. జేడీ(ఎస్)కు 40 సీట్లు వస్తాయని తెలిపింది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి సిద్దరామయ్య లేదా యెడ్యూరప్ప ఇద్దరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని స్పష్టం చేసింది.తమ అంచనాకు గల కారణాలను టౌమ్స్ నౌ వివరిస్తూ రాష్ట్రంలో లింగాయత్ లకు ప్రత్యేక మతం హోదా కల్పించినప్పటికీ ఓటర్లపై అది ఏమాత్రం ప్రభావం చూపలేదని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయడం వల్ల కోస్తా ప్రాంతపు ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ సర్వే పేర్కొంది. జనాభా అత్యధికంగా ఉన్న గ్రేటర్ బెంగళూరు ప్రాంతం లో 32 సీట్లు ఉండగా - ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సీఎం సిద్దరామయ్యకే మద్దతు తెలుపుతున్నారు. మధ్య కర్ణాటక ప్రాంతంలో క్రితంసారి నాలుస్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి 22 స్థానాలను గెలుచుకోవచ్చని ఆ సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో 40 సీట్లను గెలుచుకున్న జేడీఎస్ ఈసారి వాటన్నింటినీ నిలబెట్టుకొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చే ఓట్ల శాతం పెరుగనున్నా సీట్లు మాత్రం తగ్గుతాయని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.59 శాతం ఓట్లు రాగా - ఈసారి అది 38.6 శాతానికి పెరుగనుంది. బీజేపీకి గత ఎన్నికల్లో 19.89 శాతం ఓట్లు పొందగా - ఈసారి దానికి 35.03 శాతం వచ్చే అవకాశం ఉంది. జేడీఎస్ కు క్రితం సారికంటే 1.14 శాతం ఓట్లు పెరుగనున్నాయి.