Begin typing your search above and press return to search.

ట్రంప్ తిక్క: న‌మ్ముకున్నోడినే న‌ట్టేట ముంచాడు

By:  Tupaki Desk   |   13 March 2018 5:34 PM GMT
ట్రంప్ తిక్క: న‌మ్ముకున్నోడినే న‌ట్టేట ముంచాడు
X

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్ట్ ట్రంప్ తిక్కేంటో తెలియ‌జెప్పే మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తనకు అనుకూలంగా పనిచేయని విదేశాంగమంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ వేటు వేశారు. ఎట్టకేలకు ఆయనను పదవి నుంచి అమెరికా అధ్యక్షుడు తొలిగించారు. టిల్లర్‌ సన్‌ స్థానంలో అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) డైరెక్టర్‌ గా ఉన్న మైక్‌ పాంపియోను నియమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. పాంపియో స్థానంలో గినా హాస్పెల్‌ ను సీఐఏ డైరెక్టర్‌ గా నియమించారు. ప్రస్తుతం ఆమె సీఐఏలో డిప్యూటీ డైరెక్టర్‌ గా ఉన్నారు. సీఐఏ డైరెక్టర్‌ గా ఒక మహిళను ఎంపిక చేయడం ఇదే ప్రథమం.

‘పాంపియో ఇక మన నూతన విదేశాంగ మంత్రి అవుతారు. ఈ పదవికి ఆయన తగిన వ్యక్తి. ప్రస్తుత కీలక సమయంలో ఆయన బాగా పని చేస్తారన్న విశ్వాసం నాకు ఉన్నది’ అని ట్విట్టర్ లో ట్రంప్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో అమెరికా కార్యక్రమాలను పునరుద్ధరించి కొనసాగించడానికి - అంతర్జాతీయ సంబంధాల పటిష్ఠతకు - అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లపై పోరాటానికి - కొరియా దేశాల్లో అణునిరాయుధీకరణకు ఆయన కృషి చేస్తారు’ అని వైట్‌ హౌస్‌ ద్వారా విడుదలైన ప్రకటనలో ట్రంప్‌ పేర్కొన్నారు. సైన్యం - కాంగ్రెస్‌ - సీఐఏలో ఉన్న అనుభవంతో పాంపియో ఈ కొత్త పదవిని సమర్థంగా నిర్వహిస్తారన్న విశ్వాసం తనకు ఉన్నదని - ఆయన నియామకాన్ని త్వరగా ఆమోదించాలని సెనేట్‌ కమిటీని కోరుతున్నానని ట్రంప్‌ సేర్కొన్నారు. 65 ఏళ్ల‌ టిల్లర్‌ సన్‌ ప్రస్తుతం ఆఫ్రికా పర్యటనలో ఉండగానే ట్రంప్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తొలిగించడం గమనార్హం.

ట్రంప్‌ ప్రభుత్వ విధానాలతో టిల్లర్‌ సన్‌ పలుమార్లు విభేదించారు. ఉత్తరకొరియా - రష్యాలతో సంబంధాలపై ట్రంప్‌ వైఖరితో ఆయన ఏకీభవించడం లేదు. మంత్రిపదవి నుంచి తప్పుకోవాలని ఆయన పలుమార్లు అనుకున్నా అలాంటిదేమీ లేదని ప్రకటించాలని ట్రంప్‌ వర్గం ఆయనపై ఒత్తిడి తెచ్చింది.