Begin typing your search above and press return to search.

అదే నిజమైతే ఏపీ సర్కారుకు సిగ్గుచేటు

By:  Tupaki Desk   |   23 July 2017 5:40 PM GMT
అదే నిజమైతే ఏపీ సర్కారుకు సిగ్గుచేటు
X
ప్రపంచంలో మరెక్కడా లేని రీతిగా ఏపీ లో తాము అభివృద్ధి పనులు చేపట్టేస్తున్నాం అంటూ చంద్రబాబు ప్రభుత్వం పదేపదే టముకు వేసుకుంటూ ఉంటుంది. ఇదంతా నిజమేనా? కొత్తగా ఏర్పడిన ఈ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో బతుకుతున్న ప్రజల అభిప్రాయం ఏమిటి? వారేం అనుకుంటున్నారు. ఏ రాష్ట్రం బెటర్ అనుకుంటున్నారు అనేది కీలకం. తాజాగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పిన మాటలు వింటే.. భ్రమలు తొలగిపోతాయి. ఏపీ సర్కారు పరువు కూడా పోతుంది.

ఇంతకూ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏపీలో నివసిస్తున్న ప్రజలంతా తమ కార్లలో పెట్రోలు - డీజిల్ నింపుకోవాలంటే.. హద్దు దాటి తెలంగాణలోకి వెళ్లి నింపుకుని వస్తున్నారు. ధరల్లో అలాంటి వ్యత్యాసం ఉన్నది మరి. అయితే కేవలం ఏపీలో పన్ను బాదుడు వల్ల పెరుగుతున్న ఈ ధరలే కాదు.. అందించే సేవలు కూడా పూర్ గా ఉన్నట్లు తెలంగాణ మంత్రి మాటల్లో తెలుస్తోంది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని.. తమ రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో వసతులను గరిష్టంగా మెరుగుపరచడం గురించి చెప్పారు. ప్రజలు తెలిసీ తెలియకుండా ప్రెవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయించి ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి దుస్థితి లేకుండా ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు మెరుగు పరుస్తున్నాం అని.. ఇటీవల భద్రాచలంలోని ఒక ప్రభుత్వాస్పత్రికి వెళితే.. అందులో తెలంగాణ వారికంటె ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పల్లెల ప్రజలే చికిత్సలు పొందుతున్నారని ఆయన ప్రకటించారు. ఇది నిజమే అయితే గనుక.. ఏపీ సర్కారుకు సిగ్గు చేటు అనుకోవాలి.

ఎందుకంటే.. విభజన చట్టంలో భద్రాచలం పరిసర పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేశారు. అయితే కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. కాంగ్రెస్ ఆమోదించిన చట్టం ప్రకారమే ఆ మండలాలు వచ్చి ఏపీలో కలిశాయి. అయితే కేంద్రంలో భాజపా నుంచి ఈ మండలాలను తామేదో కష్టపడి సాధించుకు వచ్చినట్టుగా తెలుగుదేశం డప్పు కొట్టుకుంటూ ఉంటుంది. పోనీ అంతవరకు సరిపెట్టుకున్నా సరే.. అలా సాధించుకున్న తెలంగాణ మండలాల ప్రజలకు ఏపీ సర్కారు సరైన వసతులు, కనీసం ఆస్పత్రి సదుపాయాలు లాంటివి ఎందుకు కల్పించలేకపోతోంది? అక్కడి ప్రజలు ఇంకా తెలంగాణ సర్కారీ ఆస్పత్రులకే వెళ్లే పరిస్థితి ఎందుకు కల్పిస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్నాయి.