Begin typing your search above and press return to search.

రైతుల భూములు.. అధికారులకు రిజిస్ట్రేషన్

By:  Tupaki Desk   |   16 Feb 2019 10:59 AM GMT
రైతుల భూములు.. అధికారులకు రిజిస్ట్రేషన్
X
రైతులను కొట్టి రాజధానికి పెట్టాడని ఏపీ సీఎం చంద్రబాబుపై అమరావతి భూముల వ్యవహారంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పోనీ రాజధానికి కదా భూములని రైతులు మిన్నకున్నారు. కానీ ఆ భూములు ఇప్పుడు విలాసాలకు వేదికవుతున్నాయి. రైతులకు మూడు పంటలు పండే పంటలు వారి ప్రయోజనాలకు కాకుండా అధికారుల పరమవుతున్నాయి. దీన్ని రాజధానికి భూములిచ్చిన రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏపీలో రాజధానిలో ఉద్యోగులు పనిచేసేందుకు ముఖ్యమంత్రి వారికి వరాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల కిందట సదుపాయాలు కూడా పూర్తిగా కల్పించని తరుణంలో ఉద్యోగులు అమరావతికి వచ్చి పనిచేశారు. ఇలాంటి సమయంలో వారికి త్వరలో రాజధానికి సమీపంలో పక్కా ఇళ్లను నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా గుంటూరు జిల్లా తూళ్లూరులో అధికారులకు ఒక్కొక్కరికి 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.

ఈ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వీటిలో మొదటి స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ కు రిజస్ట్రేషన్‌ చేసినట్లు తూళ్లూర్‌ కార్యాలయ రిజిస్ట్రర్‌ తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికి 500 చదరపు అడుగుల స్థలంలో రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాజధాని నిర్మాణానికి తమ భూములను లాక్కొన్న ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోరా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోల్పోయి దీనావస్థలో ఉన్న తమకు పరిహారం అందించడంలో జాప్యం వహిస్తున్నారన్నారు. మా సమస్యలు విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వెళితే పోలీసులతో నెట్టించారంటున్నారు. మరోవైపు గజానికి రూ.28వేల రూపాయలు ఉన్న ప్రాంతంలో కేవలం రూ.4 వేలు రైతులకు ఇస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

మరోవైపు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అధికారుల వివరాలు బయటకు చెప్పడానికి సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరిస్తున్నారు.తమకు ఉన్నతాధికారులనుంచి అధికారుల పేరు గోప్యంగా ఉంచాలని తెలిపినట్లు రిజిస్ట్రార్‌ అధికారి భీమాబాయ్‌ తెలుపుతున్నారు. ఇలా కష్టపడి పండించిన రైతులు భూములు వదలుకుంటే వారికి న్యాయం చేయకపోగా అధికారుల పరం చేసిన చంద్రబాబు వైఖరిపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.