ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు

Wed Jan 16 2019 16:28:04 GMT+0530 (IST)

తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరనున్న సంతోషం ఒకవైపు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల్లో ఉండగానే టీఆర్ ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలకు గులాబీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా టీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన యాదవరెడ్డి - భూపతిరెడ్డి - రాములు నాయక్ లపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం  ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి - భూపతిరెడ్డి రాములు నాయక్ లు టీఆర్ ఎస్ లో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు. కానీ టీఆర్ ఎస్ పార్టీ వీరికి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. కానీ అక్కడ గెలువలేకపోయారు. రెంటికి చెడ్డ రేవడిలా వీరి పరిస్థితి దాపురించింది.

సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్సీల్లో స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. గవర్నర్ కోటాలో రాములు నాయక్ - ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి  ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరితోపాటు టీఆర్ ఎస్ ను విభేదించి కాంగ్రెస్ లోకి వెళ్లిన కొండా మురళి ఇదివరకే మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా చేయడంతో అది ఆమోదం పొంది ఆయన పదవి కోల్పోయారు.

ఇలా టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్సీలకు తెలంగాణ కొత్త శాసనసభలోకి ఎంట్రీ లేకుండా  టీఆర్ఎస్ ముందుగానే గట్టి షాక్ ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.