గ్రేట్ ఇండియా!..మూడు రోజుల్లో మూడు కీలక తీర్పులు!

Sun Aug 27 2017 07:00:01 GMT+0530 (IST)

నిజమే... భారత న్యాయ వ్యవస్థను చూసి ప్రతి భారతీయుడు గర్వించదగిన సమయమొచ్చింది. ఏనాడూ న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిడులకు గురి కాకున్నా... ఇప్పుడు వ్యవహరిస్తున్నంత క్రియాశీలకంగా మరెప్పుడూ వ్యవహరించలేదన్న మాట మాత్రం వాస్తవం. కేవలం మూడంటే మూడు రోజుల్లో... అది కూడా వరుసగా మూడు రోజుల్లో భారత న్యాయ వ్యవస్థ మూడు కీలక అంశాలకు సంబంధించి సంచలనాత్మక తీర్పులిచ్చేసింది. ఈ తీర్పులు యావత్తు భారతావని తలెత్తుకుని సగర్వంగా నిలిచేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అంతేనా... ఈ తీర్పులు భారత న్యాయ వ్యవస్థలో చరిత్రాత్మక తీర్పులుగా నిలుస్తాయని చెప్పడంలోనూ ఏ ఒక్కరికి సందేహం లేదని కూడా చెప్పల్సిందే.జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని భారత సర్వోన్నత న్యాయస్థానం నుంచి వెలువడిన మొదటి రెండు తీర్పులకు జనం జేజేలు పలకగా... పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పును పట్టుకుని కొన్ని అల్లరి మూకలు మాత్రం ఉత్తర భారతావనిని అతలాకుతలం చేశాయి. అయినా కూడా భారత న్యాయ వ్యవస్థ తన గొప్పతనాన్ని చాటుకోవడంలో ఇకపై ఏమాత్రం కూడా వెనుకంజ వేయదన్న భావన ప్రతి ఒక్క భారతీయుడితో ప్రోది చేసుకుందన్నది సుస్పష్టం. ఇక ఆ మూడు తీర్పులను గురించి మరోమారు మనం అవలోకనం చేసుకుంటే...

1. ట్రిపుల్ తలాక్ కు సుప్రీం సమ్మెట!:  దేశంలోని ముస్లిం మహిళలంతా ఏళ్లుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మొన్న సంచలన తీర్పును వెలువరించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనం ట్రిపుల్ తలాక్‌పై ఒకే మాట చెప్పడం యావత్తు ముస్లిం మహిళలను ఆనంద డోలికల్లో ముంచేసిందనే చెప్పాలి. పెళ్లి చేసుకుని జీవితాంతం నీడగా నిలవాల్సిన భర్త... తనకు మోజు తీరిపోయాకో లేక ఇంకో కారణంతోనే మూడు సార్లు వెంటవెంటనే తలాక్ చెబితే.. అతడిని పెళ్లి చేసుకున్న ముస్లిం మహిళకు ఆపై నరకమే. దీనిపై ఏళ్లుగా పోరాటం సాగుతున్నా... ఇటీవలి కాలంలో ముగ్గురు మహిళలు వేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం... .పలుమార్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయాలను కోరింది. చివరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్న ధర్మాసనం మొన్న సంచలనాత్మక తీర్పు చెబుతూ... ఒక్క దెబ్బకు తలాక్‌ను రద్దు చేసేసింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు మిగిలిన ముగ్గురు జడ్జీలతో కాస్తంత విభేదించినా... తలాక్‌ను మాత్రం స్వస్తి పలకాల్సిందేనని చెప్పేశారు. ఇక ఈ తీర్పును వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులు దేశంలోని ఐదు కీలక మతాలకు చెందిన వారు కావడం మరో విశేషం. ఐదు మతాలకు చెందిన వారైనప్పటికీ... భారత సమాజాన్ని పూర్తిగా చదివిన వారు ఒక్కుమ్మడి తీర్పు చెప్పడం భారత దేశ న్యాయ వ్యవస్థకు ఉన్న గొప్పతనంగా చెప్పుకోవాల్సిందే.

2. ఒక్క తీర్పుతో వ్యక్తిగత స్వేచ్ఛపై పూర్తి క్లారిటీ వచ్చేసింది!:  ఓ మూడు రోజుల కిందటి దాకా వ్యక్తిగత స్వేచ్ఛ... దేశ పౌరుల ప్రాథమిక హక్కా?  కాదా? అన్న మీమాంస కొనసాగింది. ఆధార్ కార్డుల ద్వారా వ్యక్తిగత  వివరాలు వెల్లడించే విషయంలో తలెత్తిన ఈ విషయంపై సుప్రీంకోర్టు చాలా స్పష్టతతో కూడిన తీర్పునే ఇచ్చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సిందేనని ఆ తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టేసింది. దేశ ప్రజలందరికీ పూర్తి భరోసా కల్పించిన ఈ తీర్పు... తలాక్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువడిన మరునాడే రావడం గమనార్హం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో దేశ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భరోసా లభించిందనే చెప్పాలి.

3. ఒక్క దెబ్బకు రేపిస్ట్ బాబాకు సంకెళ్లు!:  దేశంలో దొంగ బాబాల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో... రెండు కీలక తీర్పులను వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం ముచ్చటగా మూడో రోజు కూడా సదరు దొంగ బాబాలు కూడా భయంతో వణికిపోయేలాంటి మరో సంచలన తీర్పును వెలువరించింది. ఉత్తరాదిన... అది కూడా దేశ రాజధానికి అత్యంత సమీపంలో వెలసిన డేరా స్వచ్ఛ సౌదా ఆశ్రమానికి చెందిన గురువు గుర్మీత్ రామ్ రహీమ్ ను అతడు పాల్పడిన దురాగతాలన్నీ నిజమేనని తేల్చేసిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతడిని రేపిస్టుగా ముద్ర వేసేసింది. అంతేకాకుండా అతడిని అక్కడికక్కడే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులను ఆదేశించింది. వరుసగా రెండు రోజుల్లో సుప్రీంకోర్టు రెండు సంచలన తీర్పులను వెలువరించిన న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని గుర్తించారో ఏమో తెలియదు గానీ... పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జీ కూడా సంచలన తీర్పునే వెలువరించారు. గుర్మీత్ అనుచరులు వీరంగమాడతారని తన ప్రాణాలకే ప్రమాదం వస్తుందని తెలిసి కూడా ఆ న్యాయమూర్తి... దేశ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటుతూ ఆ తీర్పు చెప్పారు. అయితే గుర్మీత్ గురించి తెలిసిన వారంతా భయపడినట్లుగానే... అతడి అనుచరులు ఉత్తరాదిని మండించేశారు. 30 మందికి పైగా ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టేసుకున్నారు. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదన్న దిశగా... ఈ తీర్పుపై ఎలాంటి పునర్విచారణకు ఇప్పటిదాకా ఆదేశాలు జారీ కాలేదు. భవిష్యత్తులో ఆ తరహా ఆదేశాలు జారీ అవుతాయని కూడా భావించనంతగా మనకు న్యాయ వ్యవస్థ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.