Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ఎంపీల గుండెల్లో రైళ్లు!

By:  Tupaki Desk   |   20 Feb 2018 11:30 PM GMT
ఆ ముగ్గురు ఎంపీల గుండెల్లో రైళ్లు!
X
‘‘విప్ అందకుండా తప్పించుకోవడం ఎలా?’’ ఇలాంటి పుస్తకం ఎక్కడైనా ఉంటే చూడండి.. దాని ధర లక్షల్లో ఉన్నా సరే.. ఓ ముగ్గురు ఎంపీలు మాత్రం దానిని తక్షణం కొనేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారికిప్పుడు విప్ గండం పొంచి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపాదించడానికి సిద్ధం అవుతున్న అవిశ్వాస తీర్మానం మోడీ కి గండం అవుతుందో లేదో గానీ.. తమకు మాత్రం గండంగా మారుతున్నదని ముగ్గురు ఎంపీలు భయపడిపోతున్నారు. అందుకే విప్ అందకుండా తప్పించుకునే మార్గాల అన్వేషణలో గడుపు తున్నారు. ఆ ముగ్గురు ఎంపీలు మరెవ్వరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత స్వార్థ ప్రయోజనాలకోసం.. తెదేపాలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి - కొత్తపల్లి గీత - బుట్టా రేణుక లు.

విషయం ఏంటంటే.. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకు వచ్చిందంటే గనుక.. దాదాపుగా అన్ని పార్టీలు తమ తమ సభ్యలకు విప్ జారీ చేస్తాయి. ఆ లెక్కన ఈ ముగ్గురికి కూడా వైసీపీ విప్ ఇస్తుంది. విప్ అందుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఒక చిక్కు.. వారిప్పుడు తెదేపాతో అంటకాగుతున్నందున.. ఆ పార్టీ అవిశ్వాసానికి మద్దతిస్తుందో లేదో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అలాగని విప్ అందినా తదనుగుణంగా ఓటింగ్ కు వెళ్లకపోతే ధిక్కరణ అవుతుంది. పార్టీ ఫిర్యాదు చేస్తే విప్ ధిక్కరణకు పాల్పడినందుకు , వెంటనే పదవి పోయినా ఆశ్చర్యం లేదు.

ప్రస్తుతం ఆ ఎంపీల పరిస్తితి అడకత్తెరలో పోకచెక్కలా ఉన్నదన్నమాట. ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నట్లు సమాచారం. అయతే అసలు విప్ తకు అందకుండానే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా.. అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో చేరడం, విప్ జారీ కావడానికి ముందే విదేశాలకు వెళ్లడం వంటి మార్గాంతరాలు వారికి ఉంటాయి.

వారు ముగ్గురూ తెలుగుదేశంలోకి ఫిరాయించిన తర్వాత.. జగన్ ఎన్నిసార్లు స్పీకరుకు ఫిర్యాదుచేసినా.. ఏమీ ఫలితం సాధించలేకపోయారు. అదేసమయంలో.. విప్ అవకాశం వచ్చి.. విప్ ధిక్కరణ పై ఫిర్యాదు చేయగలిగితే.. ఆయన వారికి బుద్ధి చెప్పినట్లుగా అవుతుందని కూడా పలువురు భావిస్తున్నారు.