జనసేనలో చిత్రం..ఒకే నియోజకవర్గం నుంచి ముగ్గురు పోటీ

Tue Mar 26 2019 20:01:55 GMT+0530 (IST)

అవగాహన లోపమో తెలియదు. పార్టీ నేతల అత్యుత్సాహమో కానీ... జనసేన ఊహించని రీతిలో ఇక్కట్ల పాలయింది. ఇంకా చెప్పాలంటే నవ్వుల పాలయింది. గుంటూరు జిల్లా బాపట్ల జనసేనలో గందరగోళం నెలకొంది. బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ తరుపున ముగ్గురు నేతలు నామినేషన్ వేయడంతో ఆ పార్టీ నేత ఎవరు అనేదానిపై ఎవరికీ స్పష్టమైన క్లారిటీ రావట్లేదు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే చర్చ - అయోమయం జనసేనలో నెలకొంది.అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉన్న వారి వివరాలను పరిశీలించగా - గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానానికి జనసేన పోటీ చేసిన చిత్రం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్ రెడ్డి పార్టీ నుంచి బీ-ఫారం అందుకుని నామినేషన్ ను ఎన్నికల అధికారికి అందజేశారు. మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడైన ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు బాపట్ల స్థానం కేటాయించి.. మధుసూదన్ రెడ్డి బీ-ఫారంను రద్దు చేశారు. దీంతో లక్ష్మీనరసింహ బాపట్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ జనసేనకు చెందిన మరో నాయకుడు బీకే నాయుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు.

ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు బాపట్ల అసెంబ్లీ స్థానంలో ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ముగ్గురిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక పార్టీ కార్యకర్తలు - పవన్ అభిమానులు గందరగోళంలో పడ్డారు. ఈ వివాదాన్ని జనసేన ఎలా పరిష్కరిస్తుందో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి.