Begin typing your search above and press return to search.

బాబు పాపం!... ముగ్గురు ఎంపీలు గ‌ల్లంతు!

By:  Tupaki Desk   |   19 March 2018 3:30 PM GMT
బాబు పాపం!... ముగ్గురు ఎంపీలు గ‌ల్లంతు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌తి తెలుగు గొంతు గ‌ర్జించాల్సిన స‌మ‌యం ఇదే. అలాంటిది తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌తినిధులుగా లోక్ స‌భలో ఎంపీలుగా ఉన్న ఎంపీల స్వ‌రం ఎంత ప్రాధాన్యం క‌లిగిన‌దో ఇట్టే చెప్పేయొచ్చు. పార్ల‌మెంటులో ఏపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల సంఖ్య‌.. మొత్తం సంఖ్య‌తో చూస్తే చాలా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... పార్ల‌మెంటులో మొత్తం స‌భ్యుల సంఖ్య 545 అయితే... ఏపీకి చెందిన లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య కేవ‌లం 25 మాత్ర‌మే. ఆ 25 మంది అయినా త‌మదైన శైలిలో పోరు కొన‌సాగిస్తే... కొద్దో గొప్పో న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆశ తెలుగు ప్ర‌జ‌ల్లో ఉంది. అయితే ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగా ఆ 25 మంది ఎంపీల్లోని ముగ్గురు ఎంపీలు అస‌లు పార్ల‌మెంటులో కనిపించ‌డ‌మే లేదు. రాష్ట్రానికి అత్యంత కీల‌క స‌మ‌యంగా భావిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఆ ముగ్గురు కూడా మిగిలిన ఎంపీల స్వ‌రాల‌కు తోడైతే మ‌రింత‌గా ఫ‌లితం ఉంటుంద‌ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటిది ఆ ముగ్గురు ఎంపీలు అస‌లు ఢిల్లీలో క‌నిపించాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. అంతేనా పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రు కావాలంటే కూడా వారు ముగ్గురూ బెంబేలెత్తిపోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రు కావాలంటేనే జ‌డిసిపోతున్న ఆ ముగ్గురు ఎంపీలు ఇక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం ఏం గ‌ళం విప్పుతారు చెప్పండి. ఈ ముగ్గురి విప‌త్క‌ర ప‌రిస్థితికి కార‌ణం ఏమిటి? కార‌ణం ఎవ‌రు? అన్న విష‌యాల‌ను ప్ర‌శ్నించుకుంటే... వేళ్లన్నీ టీడీపీ వైపు, చంద్ర‌బాబు వైపే చూపించ‌డం ఖాయమ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ క‌థాక‌మామీషు ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే.. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌ర్నూలు - నంద్యాల - అర‌కు స్థానాల నుంచి వైసీపీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన బుట్టా రేణుక‌- ఎస్పీవై రెడ్డి కొత్త‌ప‌ల్లి గీత‌... టీడీపీ అభ్య‌ర్థుల‌పై బంప‌ర్ మెజారిటీల‌తో విజ‌యం సాధించారు.

అయితే వెంట్రుక‌వాసిలో వైసీపీకి అధికారం దూరం కాగా... వెనువెంట‌నే టీడీపీ విసిరిన వ‌ల‌కు ఎస్పీవై రెడ్డి చిక్కిపోయారు. వ్యాపార‌వేత్త‌గా ఉన్న ఎస్పీవైని త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు టీడీపీ చేసిన య‌త్నాలు క్ష‌ణాల్లోనే ఫ‌లించేశాయి. ఈ క్ర‌మంలో ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే ఎస్పీవై కండువా మార్చేశారు. ఆ త‌ర్వాత కొత్త‌ప‌ల్లి గీత కూడా ఎస్పీవై బాట‌నే ప‌ట్టారు. టీడీపీ క‌దిపిన పావుల కార‌ణంగా వైసీపీకి దూరంగా జ‌రిగిన గీత‌... టీడీపీ కార్య‌క్ర‌మాల్లో త‌ళుక్కున మెరిశారు. ఇక ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను జోరుగా ప‌రుగు పెట్టించిన చంద్ర‌బాబు... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు కాస్తంత ముందుగా బుట్టా రేణుక‌ను కూడా త‌న బుట్ట‌లో వేసేసుకుంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఎంపీలు త‌మ‌ను ఎంపీలుగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేశారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డారు. కొత్తప‌ల్లి గీత మిన‌హా మిగిలిన ఇద్ద‌రూ టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. అయితే కాల‌క్ర‌మంలో గీత మాత్రం టీడీపీకి దూరంగా జ‌రిగి.. ఇప్పుడు తాను ఏ పార్టీకి చెందిన నేత‌ను కాదంటూ కొత్త ప‌ల్లవి అందుకున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా... ఏపీకి న్యాయం కోసం ఎంపీలంద‌రూ పోరాటాన్ని హోరెత్తిస్తుంటే ఈ ముగ్గురు మాత్రం ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని ఇప్పుడు జ‌నాలంతా ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేద‌న్న వాద‌న కూడా ప్ర‌జ‌ల్లో నుంచి వినిపిస్తోంది. అదేంటంటే... పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డ వీరు... స‌భ‌కు వెళ్లాలంటే.. ఎక్క‌డ దొరికిపోతామోన‌న్న భ‌యం వీరిని వెంటాడుతోంది. పార్ల‌మెంటే కాదు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోకి కాలు పెట్టేందుకు కూడా వీరు సాహ‌సించ‌డం లేదు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటున్న వీరు ఢిల్లీ వెళ్లాలంటే మాత్రం పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని చూసి జ‌డుసుకుంటున్నార‌న‌ట‌. అంటే... విప‌క్షాన్ని బ‌ల‌హీనం చేయాల‌న్న చంద్ర‌బాబు సంక‌ల్ప‌మే వీరిని నిరాశ్ర‌యుల‌ను చేసింద‌న్న మాట‌.