Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆమంచి - అవంతిల దోస్త్ వైసీపీలో చేరుతున్నట్లా లేదా?

By:  Tupaki Desk   |   15 Feb 2019 1:18 PM GMT
ఇంతకీ ఆమంచి - అవంతిల దోస్త్ వైసీపీలో చేరుతున్నట్లా లేదా?
X
ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అన్నట్లుగా ఒకప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయింపులు జరిగితే ఇప్పుడు ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు - ఒక ఎంపీ వైసీపీలోకి జంప్ చేయగా తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. త్రిమూర్తులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.

రామచంద్రాపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ - పార్టీ మారాల్సిన అవసరం లేదని - తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకు తనకు పార్టీ మారే ఆలోచన లేదని - ప్రజలే నిర్ణయమే తన నిర్ణయమని చెప్పారు. ఇటీవల టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్ - అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి మిత్రులని చెప్పారు. అయితే, రాజకీయాలు వేరు - స్నేహం వేరని - ఎవరి రాజకీయ భవిష్యత్ కోసం వారు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

కోటిపల్లి-నరసాపురం వంతెన నిర్మించాలనేదే తన చిరకాల వాంఛ అని - జొన్నాడ-యానాం రహదారి పూర్తి చేయాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి - ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. టీడీపీని వీడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.

అయితే... ఇన్ని మాటలు చెప్పిన త్రిమూర్తులు చివరల్లో తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయంటూ బాంబు వేశారు. అంతేకాదు.. తన నియోజకవర్గంలో తన చిరకాల వాంఛల లిస్టు కూడా ఆయన చెప్పడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇవన్నీ ఆయన పార్టీ మారడానికి సూచిక అని.. అందరూ తొలుత ఖండిస్తారని.. ఆపై సడెన్‌ గా పార్టీ మారి ఇది కార్యకర్తల నిర్ణయమని - ఈ పనులన్నీ కావాలంటే పార్టీ మారడం అవసరమని ప్రతి ఒక్కరూ చెప్తారని.. త్రిమూర్తులు ప్రెస్ మీట్ కూడా అలాంటి సంకేతాలే ఇస్తోందని చెబుతున్నారు.