కులం పేరెత్తితే తంతానంటున్న కేంద్రమంత్రి!

Mon Feb 11 2019 13:52:29 GMT+0530 (IST)

సమ సమాజ నిర్మాణానికి అడ్డుగోడ కులం. శతాబ్దాలుగా మనదేశాన్ని ఈ కుల వివక్ష పట్టి పీడిస్తోంది. చట్టాల ద్వారా - రిజర్వేషన్ల ద్వారా దాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా.. అవేమీ పెద్దగా సఫలీకృతమవుతున్నట్లు కనిపించడం లేదు. రోజురోజుకూ కుల జాఢ్యం పెరుగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు కూడా కులాలవారీగా ఓట్లకు గాలమేస్తున్నాయి.కేంద్ర మంత్రి - బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తాజాగా కులాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ముందు ఎవరైనా కులం పేరెత్తితే తంతానని హెచ్చరించారు. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం సాయంత్రం ఓ బహిరంగ సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తాను కులాలను పట్టించుకోనన్నారు. పూణేలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. తన దగ్గర ఎవరైనా కులాల గురించి మాట్లాడితే తన్నులు తప్పవని హెచ్చరించారు.

కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గడ్కరి పిలుపునిచ్చారు. సమాజంలో పేద - ధనిక తారతమ్యాలను తొలగించాలని కోరారు. ఒకరిది ఎక్కువ కులం.. మరొకరిది తక్కువ కులం అనే భేదం తొలగిపోవాలని అభిలషించారు. పేదలు అణకువతో ఉండేవారు దేవునితో సమానమని వ్యాఖ్యానించారు. పేదలకు సేవ చేయడమంటే దైవాన్ని పూజించడమేనని అభిప్రాయపడ్డారు. వారికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

నరేంద్ర మోదీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడ్కరీ తాజా ప్రసంగంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకే కుల రహిత సమాజం గురించి ఆయన మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో ఒకే ఒక్క మగాడు గడ్కరీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజా ప్రసంగం విపక్షాల్లో ఆయన మైలేజీని మరింత పెంచొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రవర్ణ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీలో కుల రహిత సమాజం కోసం కృషి చేసే ఏకైక వ్యక్తిగా గడ్కరీని ప్రతిపక్షాలు ఆకాశానికెత్తేసే అవకాశముందని విశ్లేషించారు.