Begin typing your search above and press return to search.

రసకందాయంగా రాప్తాడు రాజకీయం

By:  Tupaki Desk   |   14 March 2019 4:53 AM GMT
రసకందాయంగా రాప్తాడు రాజకీయం
X
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి సారి తరహాలో ఈసారి కూడా రాప్తాడు పోరు యావత్ తెలుగు రాష్ట్రాల దృష్టి మరిల్చింది. కాగా బీసీ జనాభా అధికంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు టీడీపీ విజయఢంకా మోగించింది.

అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. బీసీలు ఎక్కువ శాతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. పరిటాల సునీతకు ఎక్కడ చూసినా చుక్కెదురు అవుతోంది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా.. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పరిటాల సునీత బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో ఓటమి తప్పదని భావించిన సునీత పోటీ నుంచి తప్పుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన వెంట ఉన్న వారికి తప్ప మిగతా వారికి సునీత చేసిందేమీ లేదని ఆ పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు.

గత రెండు పర్యాయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈసారి భారీగా పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాప్తాడుకు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో అప్పుడప్పుడే రాజకీయ రంగప్రవేశం చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కేవలం 1,500 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం 2014లో అనంతపురం జిల్లా మొత్తం టీడీపీ గాలి వీయడంతో ప్రకాశ్ రెడ్డికి రెండోసారి కూడా పరాభవం ఎదురైంది. అయితే ఓడిన చోటే గెలవాలని భావించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈసారి బలమైన శక్తిగా మారారు

నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈసారి గెలుపు ఖాయమని తెలుస్తోంది. అదేవిధంగా మరో నేత పరిటాల శ్రీరామ్ కు ఈసారి బలం తగ్గిందని చెప్పవచ్చు. సొంత సామాజిక వర్గానికి చెందిన చాలామంది సీనియర్ నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే డబ్బు ఉందనే భావంతో టీడీపీ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఫలితంగా పోరు రసవత్తరంగా మారింది.

గత 2008లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గానికి తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. టీడీపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో స్వల్ప మెజారిటీతో పరిటాల సునీత గెలిచారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. కాగా ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఆమె పోటీ నుంచి తప్పుకుని తనయుడు శ్రీరామ్ ను బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు.

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి – వేపకుంట రాజన్న - గంగుల భానుమతి - బుక్కచెర్ల నల్లపరెడ్డి - నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీ జనాభా

పరిటాల శ్రీరామ్ – బంధువర్గం మాత్రమే. సొంత సామాజిక వర్గం మినహా మిగతా వారి నుంచి భారీ వ్యతిరేకత.