Begin typing your search above and press return to search.

కేసీఆర్ నమ్మకానికి ప్రతిఫలమిదీ..

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:53 AM GMT
కేసీఆర్ నమ్మకానికి ప్రతిఫలమిదీ..
X
ఒకటి రెండు రోజుల వర్షం.. అది ఓ మోస్తారే.. నైరుతి రాక సందర్భంగా పడిన వర్షం. దానికే ప్రాణహిత పొంగింది. గోదావరిలోకి ఉవ్వెత్తున ఎగిసి వచ్చింది. కాళేశ్వరంలోకి వరద వచ్చి చేరింది.

నిజానికి కేసీఆర్ ప్రారంభోత్సవం వేళ గోదావరి అంతా ఎండిపోయి ఉంది. అంతా ఎడారిని తలపించింది. కానీ ఇప్పుడు కాళేశ్వరంలోని కన్నేపల్లి కాఫర్ డ్యామ్ వద్దకు ప్రాణహిత వచ్చి చేరింది. దాదాపు కన్నేపల్లి నుంచి మహారాష్ట్రలోని సిరొంచ వరకు 10 కి.మీల మేర గోదావరిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ సర్కారు ఈ నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తి పోసేందుకు నడుం బిగించింది.

కన్నేపల్లి కాళేశ్వరంలోని మొదటి బ్యారేజ్. ఇక్కడికి గోదావరిలోకే ప్రాణహిత నది మొదట చేరేది. కేవలం రెండు రోజుల చిన్నపాటి వర్షాలకే ప్రాణహిత ఉరకలెత్తుతోంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా తడోబా దట్టమైన అటవీ ప్రాంతంలో ఫుల్లుగా వర్షాలు పడుతున్నాయి. ఇటు అడవుల జిల్లా ఆదిలాబాద్ లోనూ వానలు పడుతున్నాయి. అందుకే ప్రాణహితలోకి చుట్టుపక్కల వార్ధ, వెయిన్ గంగా వాగుల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత నుంచి గోదావరిలోకి వరద నీరు చేరుతోంది.మరొక్క భారీ వర్షం పడితే కన్నేపల్లి కాపర్ బ్యారేజీ నిండి కిందికు నీరు మేడిగడ్డ వరకు నీరు చేరుతుంది.

కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆధారం ప్రాణహితే. దీనికి వరద ఉధృతి ఎక్కువ. మహారాష్ట్ర- ఆదిలాబాద్ లో పడే వర్షపు నీరు డైరెక్టుగా ప్రాణహితలోకి తర్వాత గోదావరిలోకి చేరుతుంది. ఎక్కడ అడ్డుకట్టవేసే ప్రాజెక్టులు లేకపోవడం.. వరద నీటి జాడ ఎక్కువగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకే 10కి.మీల నీరు కన్నేపల్లి వద్ద జమ అయ్యింది. ఇప్పుడు దీన్ని 9 భారీ మోటార్ల ద్వారా కేసీఆర్ సర్కారు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయనుంది. తద్వారా తెలంగాణ అంతటికి ఈ గోదారి జలాలు అందనున్నాయి. ప్రాణహితను నమ్మిన కేసీఆర్ నమ్మకానికి ఇప్పుడు ప్రతిఫలాలు అందుతున్నాయి.