Begin typing your search above and press return to search.

ఈసారి ఎన్నిక‌ల ఖ‌ర్చు రూ.15 కోట్లు..?

By:  Tupaki Desk   |   15 Oct 2018 7:37 AM GMT
ఈసారి ఎన్నిక‌ల ఖ‌ర్చు రూ.15 కోట్లు..?
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లై దాదాపు రెండు నెల‌లు అవుతోంది. కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌నున్నార‌న్న సంకేతాలు మూడు నెల‌ల క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌చ్చినా.. నెల త‌ర్వాతే ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. త‌ర్వాతి ప‌రిణామాల గురించి తెలిసిందే. వేగంగా మారిన ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వం ర‌ద్దు కావ‌టం.. ఆప‌ద్ద‌ర్మం తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. టీఆర్ఎస్ అభ్య‌ర్తుల జాబితాను (105 స్థానాల‌కు) ప్ర‌క‌టించారు. ఇప్పుడు కేవ‌లం 14 సీట్ల‌కు సంబంధించిన లెక్క మాత్ర‌మే తేలాల్సి ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో రూ.5-10 కోట్ల మధ్య అయిన ఖ‌ర్చు.. ఈసారి ఎంత కానుంది? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇప్పటికే ఖ‌రారైన అభ్య‌ర్థుల‌తో పాటు.. వివిధ పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు సైతం త‌మ‌కు టికెట్లు ల‌భిస్తే.. ఎంత ఖ‌ర్చు చేయాల‌న్న అంశంపై పక్కా ప్లానింగ్ గా ఉంటున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ముంద‌స్తు ఎన్నిక‌లకు సంబంధించిన సంకేతాలు అందిన వెంట‌నే.. ఎవ‌రికి వారు త‌మ ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని ముందే స‌మ‌కూర్చుకున్న‌ట్లు చెబుతున్నారు. గ‌తంతో పోలిస్తే.. ఈసారి ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా పెర‌గ‌ట‌మే కాదు.. ప్ర‌చారంలో తిరిగే చోటా మోటా నేత‌ల‌తో పాటు.. కార్య‌క‌ర్త‌ల విష‌యంలో ఖ‌ర్చులు మునుప‌టి మాదిరి లేద‌ని.. ఇప్పుడు మ‌రింత‌గా ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

గ‌తంలో లారీల్లో.. ట్రాక్ట‌ర్ల‌లో జ‌నాల్ని స‌మీక‌రిస్తే.. ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని.. కార్లు.. జీపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇలా మొద‌లైన ఖ‌ర్చు ప్ర‌తి విష‌యంలోనూ భారీగా పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఓట్ల కొనుగోలు ఖ‌ర్చు పెద్ద‌గా పెర‌గ‌కున్నా.. అనుచ‌ర వ‌ర్గం.. ప్ర‌చారం కోసం అయ్యే ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈసారి ఎన్నిక‌ల్లో త‌క్కువ‌లో త‌క్కువ ఒక్కో అభ్య‌ర్థికి ఖాయంగా రూ.10 కోట్లు ప‌క్కా అని చెబుతున్నారు. కొన్ని కీల‌క‌మైన స్థానాల్లో మాత్రం రూ.10నుంచి 15 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే అక్క‌డి నాయ‌కులు అందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో మ‌రో ప్ర‌త్యేకత ఏమంటే.. ఈసారి బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల స‌గ‌లు వ‌య‌సు 55-62 మ‌ధ్య ఉండ‌టం.. ఈసారి మిస్ అయితే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుందా? అన్న అనుమానంతో పాటు.. పెరిగిన వ‌య‌సును చూసి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించే వీలుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. అందుకే.. త‌మ జీవితంలో చివ‌రి అవ‌కాశంగా ఈ ఎన్నిక‌ల్ని భావిస్తున్న నేత‌లు లేక‌పోలేదు. అందుకే.. ఖ‌ర్చు గురించి వెనుకాడ‌కుండా.. ఎంతైనా స‌రే.. గెలుపు విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న మాట‌ను ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదే.. కోట్ల ఖ‌ర్చును అంత‌కంత‌కూ ఎక్కువ‌య్యేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో పెట్టే ఖ‌ర్చు ఆల్ టైం రికార్డుగా ప‌లువురు నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని పార్టీలు క‌లుపుకొని.. త‌క్కువ‌లో త‌క్కువ రూ.40 కోట్ల ఖ‌ర్చు ఖాయ‌మంటున్నారు. కొన్ని చోట్ల అన్ని పార్టీలు క‌లిపి దీన్ని రూ.50 కోట్ల వ‌ర‌కూ తీసుకెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదంటున్నారు.