ప్రియాంక సభ ఏమో కానీ వారికి చుక్కలు కనిపించాయి!

Tue Feb 12 2019 13:45:06 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా తనకు అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించేందుకు లక్నోకు వెళ్లారు ప్రియాంక. ఈ సందర్భంగా లక్నో ఎయిర్ పోర్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని ఏర్పాటు చేసింది.ప్రియాంక గాంధీ వస్తున్నారన్న వెంటనే.. ఆమెను చూసేందుకు.. ఆమె మాటల్ని వినేందుకు భారీ ఎత్తున జనసందోహం ర్యాలీకి వచ్చారు. ఇంత హడావుడిని ముందే ఊహించారేమో కానీ.. దొంగలు సైతం ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంకను చూసే జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు దొంగల హస్త లాఘవంతో షాకులు తగిలాయి.

దొంగల పుణ్యమా అని పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు చోరీ అయ్యాయి. ర్యాలీలో పాల్గొన్న వారిలో దగ్గర దగ్గర 50 మంది వరకూ ఫోన్లు పోయినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒక దొంగను మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తమ ప్రియతమ నేతను చూసేందుకు వస్తే.. ఊహించని రీతిలో చోరీలు జరగటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు.. నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. దొంగల ఆరా తీసేందుకు పోలీసులు  ఆపసోపాలు పడుతున్నట్లు తెలుస్తోంది.