మనమందరం తినే ప్లాస్టిక్ ఎంతో తెలుసా?

Thu Jun 13 2019 09:48:11 GMT+0530 (IST)

కాదేది కాలుష్యానికి అనర్హం అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి.. గాలి - నీరు - తిండి సహా అంతా కాలుష్యాకాకరమై పోయింది. మన చిన్నప్పుడు నీటిని ఏ చెరువులోనో - బావిలోనే తోడుకొని తాగేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. భుగర్భ జలాలను తోడేసి వాటి స్వచ్ఛతను దెబ్బతీశాం. అందుకే ఇప్పుడు నీటిని కొని తాగే పరిస్థితి. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు కూడా... భవిష్యత్ లో గాలి ని కూడా కొనే పరిస్థితి రావచ్చమే.. అంతలా ఈ ప్రకృతిని మనం చెడగొడుతున్నాం..ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న భూతం ప్లాస్టిక్. మనం తయారు చేసిన ఈ వస్తువు భూమిలో విచ్చిన్నం కాదు.. కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ అదీ మిళితం కాదు. దీంతో సముద్రాలు - భూమిపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. సముద్రంలో చేపలు - భూమిపై పశువులు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్నాయి..

అయితే మనుషులకు ప్లాస్టిక్ వల్ల ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని భావిస్తున్నారా.? కానీ ఉంది. మనం సంవత్సరానికి ఎంతలేదన్నా పావుకిలో ప్లాస్టిక్ తింటున్నామని తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన న్యూకిస్టిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. దీంతో అందరూ షాక్ తిన్నారు..

కుళాయి ద్వారా వచ్చే తాగునీరు - బాటిల్ వాటర్ - షెల్ ఫిష్ - బీర్ -  ఉప్పు - తదితర ఆహార  - ద్రవ పదార్థాల ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్ మన పొట్టలోకి చేరుతున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గాలిలో కూడా కంటికి కనిపించని విధంగా ప్లాస్టిక్ - రేణువులు ఉన్నాయని.. వాటిని మనం ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. మనం నోటి ద్వారా తీసుకునే ప్లాస్టిక్ మొత్తానికి దాదాపు సమానంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్లాస్టిక్ పీల్చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా ఎంత పకడ్బందీగా మనం బతుకుదామనుకున్నా గాలి పీల్చడం మాత్రం కంపల్సరీ.. అంటే ప్లాస్టిక్ ను పీల్చడం కూడా తప్పనిసరి.. అలా ప్లాస్టిక్ కడుపులోకి వెళితే ఏమవుతుందో తెలుసా.? ప్రాణాలకే ముప్పు. సో ప్రకృతిని మనం నాశనం చేస్తే.. అది మనల్ని నాశనం చేస్తుందన్నమాట..