Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ ను వెన‌క్కి నెట్టిన బెజోస్‌!

By:  Tupaki Desk   |   28 July 2017 8:04 AM GMT
బిల్ గేట్స్ ను వెన‌క్కి నెట్టిన బెజోస్‌!
X
కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ఓ చిన్న గ్యారేజిలో ప్రారంభించిన స్టార్ట‌ప్ కంపెనీ ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీల్లో ఒక‌ట‌వుతుంద‌ని ఎవ‌ర‌న్నా ఊహించ‌గ‌ల‌రా? కేవ‌లం ముగ్గురు వ్య‌క్తుల‌తో మొద‌లైన ఆ కంపెనీలో నేడు రెండు ల‌క్షల మంది ఉద్యోగులు ప‌ని చేస్తార‌ని ఎవ‌రైనా అనుకున్నారా? త‌న త‌ల్లిదండ్రులు ఇచ్చిన 3 లక్ష‌ల డాల‌ర్ల‌తో వ్యాపార ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన 30 సంవ‌త్స‌రాల యువ‌కుడు నేడు ప్ర‌పంచంలో కెల్లా అత్యంత సంప‌న్న‌వంతుడ‌వుతాడ‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు. వేలాది మంది యువ‌త‌కు స్ఫూర్తినిచ్చిన ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్‌.

జులై 27 వ తేదీన ఉన్న షేర్ మార్కెట్ ప్ర‌కారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. సంప‌న్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ను వెన‌క్కి నెట్టాడు. ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో అమెజాన్‌ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. దీంతో, బెజోస్‌ సంపద విలువ అమాంతం పెరిగింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం అమెజాన్‌ షేరు 1.3 శాతం లాభపడి 1065.92 డాలర్లకు చేరడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 90.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,90 లక్షల కోట్ల)కు చేరింది. .ఇదే సమయంలో బిల్‌గేట్స్‌ సంపద విలువ 90.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5.89 లక్షల కోట్లు)గా ఉంది.

అమెజాన్‌లో 17 శాతం వాటా బెజోస్‌కు ఉంది. ఈ ఏడాదిలో ఆయన సంపద విలువ 40 శాతం (24.5 బిలియన్‌ డాలర్ల మేర) పెరిగింది. అయితే, 2013 మే నుంచి బ్లూంబర్గ్‌ బిలియనీర్ల జాబితాలో గేట్స్‌దే అగ్రస్థానం. ఈ జాబితాలో 74.5 బిలియన్‌ డాలర్ల సంపదతో, నాలుగో స్థానంలో బెర్క్‌ షైర్‌ హథ్‌ఎవే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ నిలిచారు. షేర్లు లాభపడటంతో బఫెట్‌ సంపద సమీపానికి ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ చేరారు. 2017 ఆరంభంలో ఈ జాబితాలో బెజోస్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. అమ్మకాలు, మరింత పెరిగితే అమెజాన్‌ షేరు 1,250 డాలర్లకు పెరగవచ్చనే అంచనాలున్నాయి.