Begin typing your search above and press return to search.

రెహానాను బహిష్కరించిన ముస్లిం సమాజం!

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:10 AM GMT
రెహానాను బహిష్కరించిన ముస్లిం సమాజం!
X
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై చర్యకు ప్రతిచర్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించిందని ముస్లిం ప్రతినిధులు మండిపడ్డారు. ఈ మేరకు ఫాతిమాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ (సీఎంజే) ఎర్నాకులం కౌన్సిల్ ను ఆదేశించింది.

ఇటీవలే తెలంగాణకు చెందిన మోజో టీవీ జర్నలిస్ట్ కవిత జక్కలతోపాటు రెహానా ఆలయంలోకి ప్రవేశించడానికి శబరిమల వెళ్లి ప్రయత్నించింది. అక్కడి ప్రధానాచార్యులు అడ్డుకొని వారు వస్తే ప్రధానాలయం మూసివేస్తామని హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు - ఇతరులు కలిసి వారిని కొండ నుంచి పంపించివేశారు. ఈ నేపథ్యంలో రెహానా చేసిన పనికి ఆమెతో పాటు వారి కుటుంబాన్ని ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు ముస్లిం జమాత్ కౌన్సిల్ ప్రకటించింది.

సామాజిక కార్యకర్త అయిన రెహానా ఇదివరకు కేరళలో వివాదాస్పదంగా మారిన కిస్ ఫెస్టివెల్ లో పాల్గొన్నారు. అప్పుడే ముస్లిం సమాజం నోటీసులిచ్చింది. ఇప్పుడు ఏకంగా నిషేధం విధించింది.