Begin typing your search above and press return to search.

సౌతాఫ్రికా సంక్షోభానికీ...మ‌నోళ్లే కార‌ణ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:21 AM GMT
సౌతాఫ్రికా సంక్షోభానికీ...మ‌నోళ్లే కార‌ణ‌మ‌ట‌!
X
భార‌త దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు మహాత్మా గాంధీ చేప‌ట్టిన అహింసా పోరుకు బాట‌లు వేసింది ద‌క్షిణాఫ్రికాలో ఆయ‌న‌కు ఎదురైన ప‌రిస్థితులేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే... నాడు సౌతాఫ్రికాలో జాత్యంహ‌కారం తారాస్థాయిలో ఉన్న నాడే గాంధీ ఉన్న‌త విద్య కోసం అక్క‌డికి వెళ్లారు. అక్క‌డి శ్వేత‌జాతీయుల దురంహ‌కారంతో ఆయ‌న‌లో పోరాట స్ఫూర్తి ర‌గిలింది. తిరిగి మ‌న దేశానికి రాగానే ఆయ‌న స్వాతంత్య్ర సంగ్రామానికి బాట‌లు వేశారు. మ‌న దేశంలోని తెల్ల దొర‌లు ప‌రుగులు పెట్టే దిశ‌గా గాంధీ పెద్ద ఉద్య‌మాన్నే న‌డిపారు. ఆ త‌ర్వాత గాంధీజీ బాట‌లోనే న‌డిచిన సౌతాఫ్రికా న‌ల్ల జాతీయులు... త‌మ‌పై పెత్త‌నం చెలాయిస్తున్న శ్వేత‌జాతీయుల‌పై ఎడ‌తెగ‌ని పోరు సాగించి... గాంధీ త‌ర‌హాలోనే అహింసా ప‌ద్ద‌తిలో ఉద్య‌మం చేసి స్వాతంత్య్రం తెచ్చుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే గాంధీలో పోరాట స్ఫూర్తిని నింపింది సౌతాఫ్రికా అయితే... ఆ దేశంలో స్వాతంత్య్ర పోరుకు స్ఫూర్తిగా నిలిచింది గాంధీనే. అయినా ఇప్పుడీ కొత్త పోలిక‌లు ఎందుకంటారా? విజ‌య్ మాల్యా - నీర‌వ్ మోదీ - విక్ర‌మ్ కొఠారీ త‌దిత‌ర స్కాములోరు ఒక్క‌రొక్క‌రుగా బ‌య‌ట‌కు వస్తున్న వేళ‌... మ‌నోళ్ల అవినీతి ఏ మేర‌కు విస్త‌రించింది అన్న విష‌యాన్ని ఆరా తీస్తే... సౌతాఫ్రికాలోనూ మ‌నోళ్ల అవినీతి మూలంగానే అక్క‌డి ప్రభుత్వం కుప్ప‌కూలిపోయింద‌ట‌.

ఇదేదో ఏళ్ల కింద‌ట జ‌రిగిన ఉదంతం కాదు. ఇటీవ‌లే ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన ఘ‌ట‌న‌. మ‌న దేశానికి చెందిన ఓ ముగ్గురు సోద‌రులు చేసిన నిర్వాకానికి ఏకంగా ఆ దేశ అధ్య‌క్షుడిగా ఉన్న జాక‌బ్ జుమా ప‌దవి నుంచి త‌ప్పుకోవడ‌మే కాకుండా ఇప్పుడాయ‌నను ఏకంగా సొంత పార్టీనే బ‌హిష్క‌రించేసింది. మ‌రి ఇంత‌టి ఘ‌న కార్యానికి కార‌కులైన స‌ద‌రు ముగ్గురు సోద‌రులు ఎవ‌రు? ఎక్క‌డి వారు? వారు చేసిన ఘ‌న కార్యం ఏమిటి? ఆ ఘ‌న కార్యానికి జుమా ఎలా స‌హ‌క‌రించారు? ఎలా మ‌ట్టి కరిచారు? మొత్తంగా ఆ దేశ రాజ‌కీయాల‌నే ఓ కుదుపు కుదిపేసిన మ‌న ముగ్గురు సోద‌రులు ఎక్క‌డున్నారు? అన్న విష‌యాల‌ను తెలుసుకునేందుకే సోదాహ‌ర‌ణంగా పై పోలిక చెప్పాల్సి వ‌చ్చింది. ఇక అస‌లు క‌థ‌లోకి వెళితే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని స‌హ‌రాన్ పూర్‌ లో సుగంధ ద్ర‌వ్యాల వ్యాపారిగా జీవ‌నం సాగిస్తున్న ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి వ్యాపార‌స్తుడికి అజయ్‌ గుప్తా - అతుల్‌ గుప్తా - రాజేష్‌ గుప్తా అనే ముగ్గురు కుమారులున్నార‌ట‌. వ్యాపారంలో బాగానే మెళ‌కువలు నేర్పిన త‌న కుమారుల‌ను స‌ద‌రు వ్యాపారి విదేశాల‌కు వెళ్లి స‌త్తా చాటండి అంటూ ఫ్లైటెక్కించాడ‌ట‌.

ఈ ముగ్గురు బ్ర‌ద‌ర్స్‌ లో రెండో వాడైన అతుల్ గుప్తా... 1993లో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలన అంతమై మొదటి స్చేచ్ఛా ఎన్నికలు జరిగే స‌మ‌యానికి ఆ దేశ రాజ‌ధాని ప్రిటోరియాలో కాలు మోపాడు. అప్పుడే ఉదయించి... అభివృద్ధి కోసం - అవకాశాల కోసం అర్రులు చాస్తున్న దక్షిణాఫ్రికా... అతుల్‌ కు ఓ బంగారు గనిలా కనిపించింది. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సహారా కంప్యూటర్స్‌ పేరిట ఓ వ్యాపార సంస్థను ప్రారంభించాడు. ఈ కంపెనీ కార్య‌క‌లాపాలు ఏంటంటే... భారత్‌ నుంచి చౌక ధరకు కంప్యూటర్‌ విడిభాగాలు తెచ్చి- అసెంబుల్‌ చేసి అమ్మడ‌మే. కాల‌క్ర‌మంలో నెమ్మదిగా ప్రభుత్వంలోని పెద్దలతో పరిచయాలు పెంచుకుని కాంట్రాక్టులు సంపాదించడం మొదలుపెట్టాడు. ర‌ష్యా - చైనాల్లో ఉంటున్న తన ఇద్దరు సోదరులను కూడా రప్పించుకుని- వ్యాపారాన్ని పెంచాడు. క్రమేణా ఐటీ - మీడియా - మైనింగ్‌ - ఇంధన రంగాల్లో కాంట్రాక్టులను గుప్తా బ్రదర్స్‌ దక్కించుకోవడం మొదలుపెట్టారు. రైల్వే - రోడ్డు కాంట్రాక్టులు సైతం సాధించి... చివరకు పదివేల కోట్ల మేర ఆస్తిపరులయ్యారు. అయితే ఈ క్రమంలో లంచాలు మెక్కడం కూడా అధికం చేశారు. 2017లో ఓ లోకోమోటివ్‌ కాంట్రాక్టులో వారికి 400 మిలియన్‌ డాలర్ల ముడుపులు అందినట్లు తేలింది.

వీరికి పెద్ద అండ ఆ దేశ అధ్యక్షుడు జాక‌బ్ జుమానే. జుమా పిల్లలిద్దరు.. డుడుజనే - డుడుజలీ- గుప్తా కంపెనీల్లో డైరెక్టర్లు. జుమా నలుగురు భార్యల్లో ఒకరైన బోంగి నెజెమా కూడా ఓ కంపెనీలో కీలక పదవిలో ఉన్నారు. గుప్తాలు ఏం చెబితే జుమాకు అదే వేదం. వారు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకే దక్షిణాఫ్రికాలో జుమా- గుప్తాల సంబంధాన్ని ప్రస్తావించినపుడల్లా అక్కడివారు జుప్తా అని సంబోధిస్తూ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసేశార‌ట‌. ఈ అవినీతి ఎంత వరకూ పెరిగిపోయిందంటే... విదేశీ అధ్యక్షులు, ప్రధానుల రాకపోకలకు వినియోగించే ప్రత్యేక విమానాశ్రయాన్ని గుప్తా సోదరులు కూడా వాడుకోవడానికి ఇవ్వడం దాకా. అటు జుమాను - గుప్తాలను పట్టించిన కేసు 2013లో చోటు చేసుకుంది. వ్రెడే అనే ఓ ప్రైవేట్‌ రిసార్టులో గుప్తా కుటుంబీకుడొకరి వివాహం జరగడానికి ఓ డెయిరీ ప్రాజెక్టు నిధులను మళ్లించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.

ఈ వివాహం అంగరంగ వైభవంగా జరగడం, జుమా హాజరవడం, అక్కడ పెద్దెత్తున మాంసాహారం వండడం.. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. దీనిపైనే విపక్షాలు దాడి మొదలెట్టాయి. గుప్తా కుటుంబ పడగనీడ ఎంతగా విస్తరించిందో తేల్చేందుకు దర్యాప్తు మొదలయ్యింది. ఆ ధాటికి గుప్తా కంపెనీల్లో పనిచేస్తున్న జుమా కుటుంబీకులు రాజీనామా చేశారు. జుమా కూడా చివరకు వైదొలగక తప్పలేదు. అటు గుప్తాలు కూడా ఈ దర్యాప్తులు, దాడులు తట్టుకోలేక దక్షిణాఫ్రికాలోని తమ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి వారు కొన్నేళ్లుగా ఇటు దక్షిణాఫ్రికాలో వ్యాపారం తగ్గించి... దుబాయ్‌ లో వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. జుమా రాజీనామా చేసేటప్పటికే ఈ సోదరులు, మిగిలిన వారి బంధువులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదీ అక్క‌డ జ‌రిగిన తంతు. మొత్తానికి ద‌క్షిణాఫ్రికా ప్ర‌భుత్వాన్నే ప‌డ‌గొట్టేసిన మ‌న ముగ్గురు బ్ర‌ద‌ర్స్‌... మాల్యా - నీరవ్ మాదిరే ఆ దేశ పోలీసుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుపోయార‌న్న మాట‌.