తిట్టమని తీసుకొస్తే దీవించి వెళ్లిన కామ్రేడ్

Mon Mar 20 2017 14:16:22 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ర్టంలో సమస్యలు తెలుసుకునేందుకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గత ఏడాది అక్టోబరు 17న మహాజన పాదయాత్రను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలుపెట్టారు. అప్పటి నుంచి సుమారు 5 నెలలు నిరవధికంగా.. తెలంగాణలోని 31 జిల్లాల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తమ్మినేని తన పాదయాత్ర ప్రారంభించి రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎంకు పాదయాత్ర చేసే అర్హతే లేదన్నారు.. అయితే.. తమ్మినేని మాత్రం సవాల్ గా స్వీకరించి సుదీర్ఘ పాదయాత్ర చేసి నిన్న దానికి ముగింపు పలికి భారీ బహిరంగ సభ పెట్టారు.  ఈ సభకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు కేరళలో సీఎంగా ఉన్న సీపీఎం నేత పినరయి విజయన్ ను పిలిచారు. దేశంలో ఇటీవల కాలంలో సీపీఎం అధికారంలోకి వచ్చింది కేరళలోనే.. దాంతో అక్కడి సీఎం వస్తే మరింత ఉత్సాహంగా ఉంటుందని భావించారు. కానీ.. విజయన్ తీరు చూసి తమ్మినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. పార్టీ చేపట్టిన భారీ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆ సభకు హాజరుకావడానికి ముందే సీపీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి అక్కడ విందారగించి... వీనులవిందుగా ఆయన్ను పొగిడి రావడంతో ఈయన్నెందుకు పిలిచామా అని ఇప్పుడు బాధపడుతున్నారట.
    
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ లీడర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే..  విజయన్‌ను సీఎం కేసీఆర్ విందుకు ఆహ్వానించారు. దీంతో ప్రగతి భవన్‌కొచ్చిన విజయన్ అక్కడ కేసీఆర్ తో కలిసి భోజనం చేశారు. భోజనానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సుమారు 45నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ కార్యక్ర మాల్ని కేసీఆర్ ఆయనకు వివరించగా విజయన్ కూడా తెలంగాణ ఆవిర్భావానానంతరం రాష్ట్రంలో అమలౌతున్న పథకాల్ని ఒక్కొక్క టిగా అడిగి తెలుసుకున్నారు.  సంక్షేమంపై ధ్యాస పెట్టారంటూ కేసీఆర్‌ను  విజయన్ అభినందించడంతో పాటు ఈ పథకాల్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పారట.  ఈ పరిణామం తమ్మినేని వీరభద్రాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
    
కాగా కేసీఆర్ ఇంటి నుంచి వచ్చాక సభకు హాజరైన విజయన్ అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనలేదు. కేవలం కేంద్రాన్ని దుమ్మెత్తి పోసి మమ అనిపించారు. తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని దునుమాడితే.. అదే తెలంగాణ సీఎంతో ముచ్చట్లాడి సభకు వచ్చిన విజయన్ తీరు సీపీఎం నేతలను ఆశ్చర్యపరిచింది. అయితే.. సీతారాం ఏచూరి కూడా తెలంగాణ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు. కేవలం జాతీయ అంశాలకే పరిమితం అయ్యారు. అంటే.. జాతీయ స్థాయి ప్రయోజనాల కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం కేసీఆర్ కు వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం లేదని అర్థమవుతోంది. దీంతో తమ్మినేని 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర వల్ల ప్రయాస తప్ప ప్రయోజనం దక్కనట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/