Begin typing your search above and press return to search.

తెలుగోళ్లు ఇద్ద‌రు చంద్రుళ్లును లైట్ తీసుకున్నారు

By:  Tupaki Desk   |   15 May 2018 7:30 AM GMT
తెలుగోళ్లు ఇద్ద‌రు చంద్రుళ్లును లైట్ తీసుకున్నారు
X
క‌ర్ణాటక ఫలితాలు వెలువ‌డుతున్నాయి. ఊహించిన దానికి భిన్నంగా బీజేపీ అత్య‌ధిక సీట్లు సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన సీట్ల‌లో కాస్త త‌క్కువ ప‌డేటట్లు క‌నిపిస్తోంది. తాజా లెక్క‌ల్ని చూసినా 105 సీట్ల‌లో బీజేపీ గెలుపు చూస్తే.. ఏం చేసైనా ప్ర‌భుత్వాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌ర్ణాట‌క ఫ‌లితాల్ని చూస్తే.. అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాట‌ల్ని క‌ర్ణాట‌క‌లోని తెలుగు వాళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అదెలానంటే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ కావాల‌ని త‌పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో బెంగ‌ళూరుకు వెళ్లి జేడీఎస్ అధినేత మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లోని తెలుగువారంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కోరారు.

తాను తెలంగాణ వారి గురించి మాత్ర‌మే మాట్లాడ‌తాన‌న్న‌ట్లుగా ఉండే కేసీఆర్.. బెంగ‌ళూరులో మాత్రం తెలుగువారంతా తాను చెప్పిన‌ట్లుగా జేడీఎస్ కు ఓటు వేయాల‌న్నారు. క‌ర్ణాట‌క‌లో తెలుగువారి ఓట్ల‌తో విజ‌య‌వ‌కాశాలు ప్ర‌భావం ఉండే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు త‌క్కువ‌లో త‌క్కువ 50 వ‌ర‌కు ఉంటాయి. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు చూస్తే.. కేసీఆర్ మాట‌ను తెలుగోళ్లు లైట్ తీసుకున్న‌ట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. జేడీఎస్ కు భారీ ఎత్తున సీట్లు వ‌స్తాయ‌న్న ఆశ లేకున్నా.. క‌నీసం 40 స్థానాలకు పైనే ఆ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌న్న అంచ‌నా ఉంది. తాజా ఫ‌లితాలు చూస్తే.. 38 స్థానాల‌కు ప‌రిమితం కావ‌టం గ‌మ‌నార్హం. అంటే.. కేసీఆర్ చెప్పినట్లుగా తెలుగువారంతా జేడీఎస్ పార్టీకి ఓటు వేస్తే.. ఇప్ప‌టికి మించిన మెరుగైన ఫ‌లితం వ‌చ్చి ఉండేది.

ఆ మాట‌కు వ‌స్తే.. కేసీఆర్ మాట‌ను మాత్ర‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ను కూడా క‌ర్ణాట‌క‌లోని తెలుగువారు విన‌లేద‌ని చెప్పాలి. కేసీఆర్ చూస్తే.. జేడీఎస్ కు ఓటు వేయాల‌ని చెప్పి త‌న దారిన తాను తెలంగాణ‌కు వెళ్లిపోయారు. కానీ.. చంద్ర‌బాబు వ్య‌వ‌హారం వేరు. ఏం చేసైనా స‌రే.. బీజేపీకి మాత్రం ఓటు వేయొద్ద‌ని చెప్పేశారు. ఒక‌వేళ బాబు మాట‌ను తెలుగు ఓట‌ర్లు విని ఉంటే.. వంద‌కు పైగా స్థానాలు బీజేపీకి వ‌చ్చి ఉండేవి కాదు. అంటే.. బాబు మాట‌ను క‌ర్ణాట‌క‌లోని తెలుగు వారు విన‌లేదా? అన్న సందేహం రాక మాన‌దు.