Begin typing your search above and press return to search.

పవన్ రాకపోతే వాళ్ళెవరికీ పట్టదా

By:  Tupaki Desk   |   6 Oct 2015 11:30 PM GMT
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా .... అని అప్పుడెప్పుడో ఒక సినీ కవి చెప్పారు. కానీ తెలుగు ప్రజలు మాత్రం తమ కష్టాలకు ఎప్పుడూ ఎవరో ఒక నాయకుడో, నాయకురాలో, మంచి ఫాలోయింగ్ వున్న ఒక పెద్ద హీరోనో తమ తరఫున పోరాడాలి అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డం మానలేకపోతున్నారు.

వివరాల్లోకి వెళ్ళినట్లైతే - ఊరంతా ఒక దారి.. మరేదో ఇంకో దారి అన్నట్లుండే తమిళనాడు ప్రభుత్వం అక్కడుండే స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్ట్ ను, తెలుగు మీడియంను రద్దు చేసింది. దీని ఫలితంగా ఆ రాష్ట్రంలో తమిళుల తరువాత అత్యధికులైనటువంటి పలు తెలుగు కుటుంబాలు తమ పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. కానీ ఇంత జరుగుతున్నా తమ కోసం, తమ పిల్లల చదువుల కోసం అక్కడుండే ఏ ఒక్క తెలుగు సంఘమూ అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి తమకు ప్రభుత్వ నిర్ణయం పట్ల వున్న విముఖతను వ్యక్త పరచకుండా పవన్ కళ్యాణ్ రావాలి ఉద్యమం చేయాలి తద్వారా తెలుగు భాష మళ్ళీ బోధన జరగాలి అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి.

బహుశా తెలుగు వారికి అన్నగారు అలవాటు చేసిన ఆత్మగౌరవ నినాదం, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలతో పోయినట్లు కనబడుతోంది. తెలుగు వాళ్ళు తమ సొంత కాళ్ళ మీద నిలబడే శక్తి పోయిందేమోననే మాట ఎవరో వారి నుంచి వినబడక ముందే కాస్త జాగ్రత్త పడి కనీసం తమ వంతు పోరాటం మొదలుపెడితే తరువాత కలిసి వచ్చేదెవరో ? రానిదెవరో చూసుకోవచ్చు.

ఆ మధ్య హైదరాబాదులో యువత ఒక సమావేశం పెట్టి తమిళనాడులో తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలసి పనిచేయాలని కోరారు. వారి కోరిక సమంజసమే కావచ్చు. కానీ ప్రాథమికంగా.. అక్కడ తెలుగును కాపాడుకోవడం కోసం అక్కడి వారిలో ఒక ఉద్యమం మొదలైతే.. ఎవరైనా దానికి సహకరించగలరు గానీ.. ఇక్కడినుంచి వెళ్లి అక్కడ మొదలెట్టాలంటే ఎలా కుదురుతుంది.