Begin typing your search above and press return to search.

సుహాసిని రాకతో దేశం నివురుగ‌ప్పిన నిప్పు

By:  Tupaki Desk   |   18 Nov 2018 9:30 AM GMT
సుహాసిని రాకతో దేశం నివురుగ‌ప్పిన నిప్పు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పెరుగుతోందా.? .పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హఠాత్తుగా తెర మీదకి తెస్తున్న కొత్త ముఖాలతో దేశంలో సీనియర్లు అలక బూనుతున్నారా.? తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి ఆంధ్ర్రప్రదేశ్ నాయకులను - వారి వారసులను తీసుకు వస్తున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నందమూరి హరిక్రిష్ణ కుమార్తెను బరిలోకి నిలిపింది. సమైక్య రాష్ట్రం కోసం పదవికి రాజీనామా చేసి తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రకటించిన నందమూరి హరిక్రిష్ణ కుమార్తెను తెలంగాణలో పోటీకి నిలపడం ఎంత వరకూ సమంజసమని తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు ఇ. పెద్దిరెడ్డిని పార్టీ అభ్యర్దిగా ప్రకటించి నామినేషన్‌ కు సైతం సిద్దంగా ఉండాలని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారట. ఈ భరోసాతో పెద్దిరెడ్డి కూకట్‌ పల్లిలో భారి ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నాక సుహాసినిని తెర పైకి తీసుకు వచ్చారు. ఈ సంఘటనతో పెద్దిరెడ్డి పైకి గంభీరంగా ఉన్న లోలోపల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

మహాకూటమి అదికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణలో ఎంత మంది నాయకులను బుజ్జగిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు . గత ఎన్నికలలో టిక్కెట్లు రానివారికి వచ్చే ఎన్నికలలో ఇస్తామని వాగ్గానం చేసారట. అలా హామీ తీసుకుని భంగపడ్డవారిలో శోభరాణి వంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్‌ గిరి ఇప్పిస్తామంటూ నాలుగు సంవత్సరాలు వేచి చూసేలా చేశారు. చివరకు విసిగి వేసారిన నరసింహులు పార్టీ వదలి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులను - పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని నందమూరి సుహాసినికి ఎలా టిక్కెట్టు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అంపశయ్యపై ఉన్న పార్టీని కాపాడుకుంటున్న నాయకులకు - కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. రేపు మహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీదే పై చెయ్యి ఉంటుంది తప్పా...తెలుగుదేశం పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఉండదని - తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమిలో కాంగ్రెస్‌తో కూడి మనుగడ సాగించడం కత్తి మీద సామే అని అంటున్నారు.