Begin typing your search above and press return to search.

టెలీనార్ సిమ్ వాడుతున్నారా?జాగ్ర‌త్త‌గా ఉండండి

By:  Tupaki Desk   |   28 April 2016 7:11 AM GMT
టెలీనార్ సిమ్ వాడుతున్నారా?జాగ్ర‌త్త‌గా ఉండండి
X
నార్వేకు చెందిన టెలికామ్ రంగ దిగ్గజం టెలినార్.. భారత్ నుంచి తమ టెలికామ్ కార్యకలాపాలను ఎత్తివేస్తామన్న సంకేతాలిచ్చింది. అయితే సరసమైన ధరలలో మరింత స్పెక్ట్రమ్‌ ను సమకూర్చుకోలేకపోతేనేనని స్పష్టం చేసింది. త్వరలో స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో టెలినార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 700 మెగాహెట్జ్ శ్రేణిలో మెగాహెట్జ్ 11,485 కోట్ల రూపాయల చొప్పున స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టెలినార్ ఇండియాకున్న అరకొర స్పెక్ట్రమ్‌ తో సంతృప్తికర సేవలను అందించలేకపోతున్నామని, కావాల్సినంత స్పెక్ట్రమ్ లేక భారీ నష్టాలకు లోనవుతున్నామని టెలినార్ గ్లోబల్ సిఇఒ సిగ్వే బ్రెక్కె నార్వేలో సంస్థ ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

టెలినార్ ఇండియా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దాదాపు 2,530 కోట్ల రూపాయల (నార్వే కరెన్సీలో 3,100 మిలియన్ ఎన్‌ ఒకె) నిర్వహణ నష్టాన్ని చవిచూసినట్లు ఈ సందర్భంగా సిగ్వే తెలిపారు. గత ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 159 మిలియన్ ఎన్‌ ఒకెల నష్టమేనని చెప్పారు. భార‌త‌దేశంలో టెలినార్ దీర్ఘకాల కార్యకలాపాలు.. అక్కడ మాకు అందే అదనపు స్పెక్ట్రమ్‌ పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ తో మార్కెట్‌ లో నెలకొన్న పోటీని ఎదుర్కోలేకుండా ఉన్నాం అని అన్నారు. టెలినార్ సిఎఫ్‌ ఒ మార్టిన్ కార్ల్‌ సన్ మాట్లాడుతూ దీన్ని స‌మ‌ర్థించారు. భార‌త్‌ కు తాము ఆదాయం కోసమే వచ్చామ‌ని పేర్కొంటూ ఒకవేళ మాకు లాభాలు రాకపోతే, మేము ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాల్సిన అవసరం ఉంది అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

మరోవైపు భారత్‌ లో 4జి సేవల విస్తరణ వైపునకు టెలినార్ వడివడిగా అడుగులేస్తోంది. తమ చౌక ధరల వ్యూహంలో భాగంగా తక్కువ ధరకే 4జి సేవలను వినియోగదారులకు అందిస్తామంటోంది. ‘టెలినార్ ఇండియా అనేది మార్కెట్‌ లో సామాన్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. తక్కువ ధరలకే టెలికామ్ సేవలకు సంస్థ కట్టుబడి ఉంది.’ అని టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ సిఇఒ శరద్ మెహ్రోత్రా స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా 4జి సేవలను టెలినార్ ప్రారంభించింది. అనంతరం శరద్ మాట్లాడుతూ 4జి సేవలను అత్యంత తక్కువ ధరకే అందించేలా ముందుకెళ్తున్నామన్నారు. ఇకపోతే ఇప్పటికే టెలినార్ వారణాసిలో 4జి సేవలను అందిస్తోంది. రాబోయే 45-60 రోజుల్లో తమ ఆరు సర్కిళ్లలోని 6 నుంచి 8 నగరాల్లో ఈ హైస్పీడ్ నెట్‌ వర్క్‌ ను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందులోభాగంగానే విశాఖలో ఇప్పుడు పైలట్ 4జి సర్వీస్‌ ను ఆరంభించింది. కాగా, దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లు ఉంటే, ఆరు సర్కిళ్లలో టెలినార్ ఇండియా సిడిఎమ్‌ ఎ ఆధారిత సేవలను అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ తోపాటు - తూర్పు - పశ్చిమ ఉత్తరప్రదేశ్ - బీహార్ - గుజరాత్ - మహారాష్ట్ర సర్కిళ్లలో టెలినార్ సేవలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి టెలినార్ కస్టమర్లు 51.6 మిలియన్లుగా ఉన్నారు.