Begin typing your search above and press return to search.

రూ.1274 కోట్లు వెనక్కి కాదు.. మరింత కట్టాలా?

By:  Tupaki Desk   |   31 July 2015 4:54 AM GMT
రూ.1274 కోట్లు వెనక్కి కాదు.. మరింత కట్టాలా?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీల సంగతి అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఇష్యూలు పెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ కు సంబంధించి కట్టాల్సిన ఐటీ మొత్తంపై నోటీసులు ఇవ్వకపోవం.. ఆ శాఖాధికారులు లైట్ తీసుకోవటం.. దీంతో ఐటీ శాఖ.. టీ సర్కారుకు చెందిన మొత్తాన్ని ఆర్ బీఐ అనుమతితో ఏక మొత్తంగా రూ.1247 కోట్లు తమ ఖాతాలోకి బదలాయించుకోవటం తెలిసిందే.

ఒక్కసారిగా ఇంత భారీ మొత్తాన్ని చేజార్చుకోవటంపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై కేంద్ర స్థాయిలో పావులు కదిపినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. మరో సమస్య ఒక తెరపైకి వస్తుందన్న విషయాన్ని గుర్తించారు. తాజాగా ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖాధికారులు టీ బేవరేజస్ కార్పొరేషన్ కు వచ్చి అక్కడి లావాదేవీలను తనిఖీ చేశారు.

ఈ చర్య అనంతరం పరిస్థితిపై సమీక్షించిన అధికారులు.. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సమాయుత్తమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే జరిగితే.. మరో భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.1274 కోట్లు చేజారటంపై అగ్రహంగా ఉన్న తెలంగాణ సర్కారు.. సేవా పన్ను రూపంలో మరింత మొత్తం కట్టాల్సి ఉంటుందన్న సమాచారం అధికారుల్ని వణికిస్తోంది. అలాంటి నోటీసు వస్తే.. తమ నిర్లక్ష్యంగా.. తప్పంతా తమదేగా ప్రభుత్వం భావిస్తుందని.. అదే జరిగితే ముఖ్యమంత్రి అగ్రహానికి గురి కాక తప్పదని భావిస్తున్నారు.

అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. తాజా పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ను రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా కసరత్తు జరగటం గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో బయటకు వస్తుందని అంచనా వేస్తున్నారు. డబ్బులు రావటం సంగతి తర్వాత.. మరింత మొత్తం చేజారుతుందంటే.. ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు..?