Begin typing your search above and press return to search.

ఇవాంకాకు వ‌డ్డించే వంట‌కాలు ఇవి కొన్ని!

By:  Tupaki Desk   |   21 Nov 2017 3:30 PM GMT
ఇవాంకాకు వ‌డ్డించే వంట‌కాలు ఇవి కొన్ని!
X
ప్ర‌పంచానికే పెద్ద‌న్న అమెరికా. దానికి అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ట్రంప్ కుమార్తె ఇవాంకా తొలిసారి ఇండియాకు రానున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వారంలో ఆమె హైద‌రాబాద్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు హైద‌రాబాద్ లో ఆమె ప‌ర్య‌టించ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

ఇందుకు సంబంధించి ఫైన‌ల్ షెడ్యూల్ ఏమిట‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. ఇదిలా ఉంటే.. త‌న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ల్లో ఇవాంకా రెండు విందుల‌కు హాజ‌రు కానున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒక‌టి భార‌త స‌ర్కారు నిర్వ‌హిస్తుండ‌గా.. రెండో విందును తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వహించ‌నున్నారు. గ్లోబ‌ల్ ఎంటర్ ప్రెన్యూర్ స‌ద‌స్సులో అమెరికా త‌ర‌ఫున హాజ‌రు కానున్న ఆమె కోసం భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆమె ఎక్కడైతే ప‌ర్య‌టిస్తారో.. ఆయా ప్రాంతాల్ని ఇప్ప‌టికే అందంగా సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్య‌యంతో ఇవాంకా ప‌ర్య‌టించే ప్రాంతాల్లో రోడ్లు.. సుంద‌రీక‌ర‌ణ కోసం వెచ్చిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇవాంకా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇప్ప‌టికే ఆమె భ‌ద్ర‌త మీద అమెరిక‌న్ సీక్రెట్ స‌ర్వీస్ అధికారులు దృష్టి సారించారు. ఇక‌.. ఆమె పాల్గొనేరెండు విందుల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ నెల 28 రాత్రి ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో కేంద్రం విందును నిర్వ‌హిస్తుండ‌గా..త‌ర్వాతి రోజు రాష్ట్ర స‌ర్కారు విందును ఏర్పాటు చేసింది.

ఈ విందులో తొలుత గోల్కొండ కోట‌లో అనుకున్న‌ప్ప‌టికి.. భ‌ద్ర‌త‌తో పాటు ఇత‌ర అంశాల్ని (ఓపెన్ ల్యాండ్ లో నిర్వ‌హించాల్సి రావ‌టం) దృష్టిలో పెట్టుకొని వెన్యూను మార్చాల‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఇచ్చే విందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందును తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ స్వ‌యంగా స‌మీక్షిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇవాంకాకు ఇచ్చే విందును భారీగా ప్లాన్ చేస్తున్న కేటీఆర్‌.. మెనూను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. విందు సంద‌ర్భంగా వ‌డ్డించే మెనూను ఆయ‌న డిసైడ్ చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఇవాంకాతో పాటు ప‌లు దేశాల అతిధులు హాజ‌రు కానున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకొని మెనూ సిద్దం చేశారు. ఓప‌క్క ఆయా దేశాల వారీ తినే ఆహారంతో పాటు.. స్థానికంగా బాగా పేరున్న వంట‌కాల్ని సైతం వ‌డ్డించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇండియ‌న్‌.. చైనీస్‌.. ఫ్రెంచ్‌..గ్రీక్‌.. ఇటాలియ‌న్‌.. క‌రేబియ‌న్ వంట‌కాల్ని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించ‌నున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ చెఫ్ ల‌ను హైద‌రాబాద్‌కు ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ప‌లు విదేశీ వంట‌ల‌తో పాటు.. స్థానిక రుచుల్ని సైతం ఇవాంకాకు ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం ఒక మెనూను సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం. ఇవాంకాకు ఇచ్చే విందులో స‌ర్వ్ చేసే లోక‌ల్ వంట‌కాల విష‌యానికి వ‌స్తే..

+ పత్త‌ర్ కా గోస్ట్

+ షీర్ కుర్మా

+ డబుల్ కా మిఠా

+ ఖుర్బానీ కా మిఠా

+ రవ్వ లడ్డు

+ బగారా బైగాన్

+ ద‌మ్ కి బిర్యానీ

+ ప‌లు స్థానిక‌ వంట‌కాలు

+ ఇరానీ చాయ్