Begin typing your search above and press return to search.

టీడీపీ క్లీన్ బౌల్డేనా?..టీ ఓట‌రు తీర్పు ఇదే!

By:  Tupaki Desk   |   11 Dec 2018 7:17 AM GMT
టీడీపీ క్లీన్ బౌల్డేనా?..టీ ఓట‌రు తీర్పు ఇదే!
X
తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన‌ట్టేన‌న్న వాదన వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చాలా స్పీడుగా తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటుగా... తెలంగాణ‌లో పార్టీకి పున‌ర్వైభవం తీసుకుని వ‌చ్చేందుకు అందుబాటులోని ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోరాద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా అధికార పార్టీ టీఆర్ ఎస్‌ తో పొత్తుకు ఆయ‌న త‌హ‌త‌హ‌లాడారు. అయితే చంద్ర‌బాబు స్నేహ హ‌స్తాన్ని అందుకునేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు స‌సేమిరా అన్నారు. దీంతో ప్ర‌త్యామ్నాయ‌మేంట‌న్న కోణంలో ఆలోచ‌న చేసిన చంద్ర‌బాబు... పార్టీకి క‌నీస సంఖ్య‌లో సీట్లైనా కావాల్సిందేన‌న్న భావ‌న‌తో... ఏ పార్టీకి వ్య‌తిరేకంగా అయితే టీడీపీ ఆవిర్భ‌వించిందో... అదే పార్టీతో పొత్తుకు సై అన్నారు. అయితే సేమ్ టూ సేమ్ అదే ఆలోచ‌న‌తో ఉన్న కాంగ్రెస్ కూడా స‌రేన‌న‌డంతో చంద్ర‌బాబు చ‌క‌చ‌కా పావులు క‌దిపారు.

నాలుగు పార్టీల క‌ల‌గూర గంప‌గా అవ‌త‌రించిన ప్ర‌జా కూట‌మి ముందు టీఆర్ ఎస్ డంగైపోవ‌డం ఖాయ‌మేన‌న్న ఫీల‌ర్ల‌ను వ‌దిలిన చంద్ర‌బాబు... ప్ర‌చారంలో త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఇక నాలుగు పార్టీల మ‌ధ్య సీట్ల పంప‌కంలో భాగంగా కేవ‌లం 14 సీట్ల‌ను ద‌క్కించుకున్న టీడీపీ... వాటిలోనూ 13 చోట్ల మాత్ర‌మే పోటీ చేసింది. ఈ 13 సీట్ల‌లో క‌నీసం సగం సీట్ల‌లో అయినా పార్టీ అభ్య‌ర్థులు గెల‌వ‌క‌పోతారా? అన్న ధీమాతో చంద్ర‌బాబు ఉన్నట్లుగా క‌నిపించింది. అయితే నేటి ఉద‌యం నుంచి ప్రారంభ‌మైన కౌంటింగ్ స‌ర‌ళి చూసి బాబు నిజంగానే డంగైపోయి ఉంటారు. ఎందుకంటే... టీడీపీ పోటీ చేసిన మొత్తం 13 స్థానాల్లో ఓ రెండు స్థానాలు మిన‌హా మిగిలిన 11 స్థానాల్లో ఓట‌మి అంచుల్లో నిల‌బ‌డి పోయింది. పార్టీకి పూర్వ వైభ‌వం రావాలంటే... పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు వార‌సులు బ‌రిలోకి దిగాల్సిందేన‌న్న క‌ల‌రింగ్ ఇచ్చిన చంద్ర‌బాబు... నంద‌మూరి ఫ్యామిలీని తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసేందుకు వేసిన కుట్ర‌లో భాగంగా కూక‌ట్ ప‌ల్లిలో హ‌రికృష్ణ కూతురు చుండ్రు సుహాసినిని రంగంలోకి దించేశారు. ఆమె గెలుపు కోసం అహ‌ర‌హం శ్ర‌మించారు. త‌న‌తో పాటు త‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ‌ను కూడా పూర్తి స్థాయిలో ప్ర‌చారంలోకి దించేసిన చంద్ర‌బాబు... సుహాసిని గెలుపు కోసం చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌నే చెప్పాలి.

అయితే బాబు మాయోప‌యాన్ని గ‌మ‌నించిన యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - క‌ల్యాణ్ రామ్‌ లు త‌మ సోద‌రికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకే రాలేదు. వెర‌సి ఆ ఎఫెక్ట్ బాగానే దెబ్బ కొట్టేసిన‌ట్టుంది. ప్ర‌స్తుతం సుహాసిని ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి - టీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావు కంటే ఆమె దాదాపు 9 వేల పై చిలుకు ఓట్ల దూరంలో వెనుక‌బ‌డిపోయారు. 5 రౌండ్ల ఫ‌లితాల‌కే ఈ మేర వెనుక‌బ‌డిపోతే... ఇక ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక చంద్ర‌బాబు కీల‌కంగా ప‌రిగ‌ణించిన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం శేరిలింగంప‌ల్లిలో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ముఖ్యుడు - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వెనిగ‌ళ్ల ఆనంద ప్ర‌సాద్ విజ‌యం కూడా న‌ల్లేరుపై న‌డ‌కే అనుకున్నారు. అయితే బాబు అంచ‌నాల‌ను తారుమారు చేసిన శేరిలింగంప‌ల్లి ఓట‌ర్లు... ఆనంద‌ప్ర‌సాద్‌ కు చుక్క‌లు చూపిస్తున్నారు. స‌గానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తి అయిన ప్ర‌స్తుత త‌రుణంలో భ‌వ్య ఆనంద‌ప్ర‌సాద్‌ గా సుప్ర‌సిద్దుడైన టీడీపీ అభ్య‌ర్థి 12 వేల ఓట్ల పైచిలుకు మేర వెనుక‌బ‌డిపోయారు. ఇక్క‌డా టీడీపీ అప‌జ‌యాన్నే మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక టీడీపీ పోటీ చేసిన ఉప్ప‌ల్‌ - రాజేంద్ర న‌గ‌ర్‌ - స‌న‌త్ న‌గ‌ర్‌ - మ‌క్త‌ల్‌ - వ‌రంగ‌ల్ వెస్ట్‌ - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ అభ్య‌ర్థులు దాదాపుగా ఓడిపోయే ప‌రిస్థితి చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పోటీ టీఆర్ ఎస్‌ - స్వ‌తంత్రుడిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి మ‌ధ్యే నెల‌కొన‌గా... అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న సామ రంగారెడ్డి... వారిద్ద‌రికీ చాలా దూరంలో ఉండిపోయారు. గుడ్డిలో మెల్ల అన్న‌ట్లుగా ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి - అశ్వారావుపేట‌ల్లో మాత్రం టీడీపీ అభ్య‌ర్థులు గెలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.