Begin typing your search above and press return to search.

రూ.2ల‌క్ష‌ల కోట్ల‌ను ట‌చ్ చేయ‌నున్న బ‌డ్జెట్‌?

By:  Tupaki Desk   |   24 Jan 2019 5:25 AM GMT
రూ.2ల‌క్ష‌ల కోట్ల‌ను ట‌చ్ చేయ‌నున్న బ‌డ్జెట్‌?
X
తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ అంచ‌నాలు భారీగా పెర‌గ‌నున్నాయి. కాగితాల మీద అంకెలు చూపించే విష‌యంలో ఘ‌నంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌టం రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల‌కు అల‌వాటే. భారీ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టినా.. అందులో వ‌చ్చే ఆదాయం.. చేసే ఖ‌ర్చు మాత్రం త‌క్కువ‌గా ఉంటోంది. అయిన‌ప్ప‌టికీ.. ఆ విష‌యాల్ని ప‌ట్టించుకోకుండా ఏడాదికేడాది బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్ని భారీగా చేయ‌టం ఒక అల‌వాటుగా మారుతోంది.

తాజాగా తెలంగాణ బ‌డ్జెట్ కు సంబంధించిన క‌స‌ర‌త్తులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్ప‌టికే 32 శాఖ‌ల నుంచి ప్ర‌తిపాద‌న‌ల్ని తీసుకున్న ఆర్థిక శాఖ‌.. బ‌డ్జెట్ ను ఒక రూపు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. గ‌త బ‌డ్జెట్ రూ.1.72ల‌క్ష‌ల కోట్లు కావ‌టం.. ఈసారి క‌నీసం 15శాతం ఎక్కువ‌తో ఏకంగా రూ.2ల‌క్ష‌ల కోట్లకు చేర్చేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌కుండా ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తార‌ని చెబుతున్నారు.

పేరుకు ఓటాన్ అకౌంట్ అయిన‌ప్ప‌టికీ ప‌న్నెండు నెల‌ల కాలానికి బ‌డ్జెట్ అంచ‌నాలు ఉంటాయ‌ని చెప్పాలి. మూడు నెల‌ల స్వ‌ల్ప కాలిక బ‌డ్జెట్ అయిన‌ప్ప‌టిక లెక్క‌ల్ని మాత్రం పన్నెండు నెల‌ల‌కు తీసుకుంటున్నారు. మ‌రి.. రూ.2ల‌క్ష‌ల బ‌డ్జెట్ లో కేటాయింపులు ఏ శాఖ‌కు ఎలా ఉంటాయ‌న్న అంచ‌నాల విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్రాధామ్యాయాల‌ను చూస్తే.. సాగునీటి శాఖ‌కు.. వ్య‌వ‌సాయ‌..సంక్షేమ శాఖ‌కు భారీ ప్రాధాన్య‌త ఇస్తార‌ని చెప్పాలి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల్ని చేప‌ట్టిన నేప‌థ్యంలో ఈసారి బ‌డ్జెట్ లో సాగునీటికి భారీ బ‌డ్జెట్ ఉండ‌నుంది. కాళేశ్వ‌రం.. పాల‌మూరు-రంగారెడ్డి.. సీతారామ.. దేవాదుల‌..డిండి లాంటి ప్రాజెక్టుల‌ను దృష్టిలో పెట్టుకొని రూ.24 వేల కోట్ల‌ను కేటాయించ‌నున్నారు. రైతుబంధు ప‌థ‌కం కింద రూ.12వేల కోట్లు.. రుణ‌మాఫీ కోసం రూ.6వేల కోట్లు.. విద్యుత్ రంగానికి రూ.5వేల కోట్లు.. పోలీస్ శాఖ‌కు రూ.5వేల కోట్లు కేటాయిస్తార‌ని చెబుతున్నారు.

ఇక‌.. సంక్షేమానికి పెద్ద పీట వేయాల‌ని భావిస్తున్న ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే ఈసారి వైద్య ఆరోగ్య శాఖ‌కు దాదాపు రూ.7500 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల‌ని భావిస్తున్నారు. పెరిగిన పెన్ష‌న్ల భారం రూ.400 కోట్ల వ‌ర‌కూ చేరుతుంద‌ని చెబుతున్నారు. ఖ‌ర్చుకు సంబంధించిన అంచ‌నాలు మ‌రింత భారీగా పెరిగిన వేళ‌.. ఆదాయం ఏ మాత్రం పెరుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.