Begin typing your search above and press return to search.

బీజేపీ వైపు క్యూ కడుతున్న తెలంగాణ రెడ్లు!

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:02 AM GMT
బీజేపీ వైపు క్యూ కడుతున్న తెలంగాణ రెడ్లు!
X
తెలంగాణ లో రెడ్లు తమ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక రేంజ్ లో ఉనికిని చాటారు వీళ్లు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రెడ్లు రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన కోసం పోరాడిన వారిలో కూడా వీళ్లే ముందున్నారు. అయితే అదే తెలంగాణ వారి రాజకీయ ఉనికిని దెబ్బతీసింది.

ఏపీలో రెడ్లు మళ్లీ రాజకీయ ఉనికిని చాటుకోగలిగారు. అధికార పార్టీలో ఏకంగా నలభై ఎనిమిది మంది రెడ్లు ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా అదే కులానికి చెందిన వ్యక్తి. ఇలా ఏపీ రాజకీయం విషయంలో వారు సంతృప్తి పరంగా ఉన్నారు. అయితే తెలంగాణలో మాత్రం రాజకీయంగా బలవంతులు అయినప్పటికీ వారికి ముఖ్యమంత్రి పీఠం ఇప్పట్లో దక్కే అవకాశాలు కనిపించడం లేదు!

తెలంగాణ అసెంబ్లీలో కూడా రెడ్ల సంఖ్య గణనీయంగా ఉంది. అయితే అయితే వారికి అసలు పీఠం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అది కాంగ్రెస్ ద్వారా కుదురుతుందని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ కోలుకోలేదు. కోలుకునే అవకాశాలూ కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో రెడ్డి కుల నేతలు భారతీయ జనతా పార్టీ వైపు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా బీజేపీ వారికి పెద్ద పీట వేసింది. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంది కూడా. ఈ నేపథ్యంలో పలువురు రెడ్డి నేతలు జై బీజేపీ అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేకుండా మిగిలిపోయిన ఇ. పెద్దిరెడ్డి - రావుల చంద్రశేఖర రెడ్డి వంటి వారు బీజేపీలో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక కోమటిరెడ్డి సోదరులు కూడా అటు వైపే చూస్తున్న వైనం స్పష్టం అవుతోంది. లేటెస్ట్ అప్ డేట్స్ లో జగ్గారెడ్డి పేరు కూడా కమలం పార్టీ వైపే వినిపిస్తూ ఉంది. టీఆర్ ఎస్ తరఫున పని చేసిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరిన వైనం తెలిసిందే. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా కమలం పార్టీ వైపే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పేరు కూడా ఈ విషయంలో వినిపిస్తూ ఉంది.

ఇలా రెడ్డి ప్రముఖులు అంతా ఇప్పుడు వరసగా బీజేపీలోకి క్యూ కట్టేలా ఉండటం ఆసక్తిదాయకంగా మారింది.