Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీ కేరాఫ్ ఎర్రమంజిల్

By:  Tupaki Desk   |   31 July 2016 5:18 AM GMT
తెలంగాణ అసెంబ్లీ కేరాఫ్ ఎర్రమంజిల్
X
ఉన్నవాటికి దిక్కులేదు. కొత్తవాటి మీద తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఎంత మోజో తెలియంది కాదు. ఇప్పటికే ఉన్న వాటిని సరిగ్గా ఏడ్వలేకపోయినా.. కొత్త కొత్త వాటిని కట్టేస్తామంటూ బడాయి మాటలు చెప్పేసి.. రోజుకో కొత్త కలను ఆవిష్కరిస్తూ.. తమ కలల కాయలు పండ్లుగా మారితే.. మాటల్లో చెప్పే బంగారు తెలంగాణ.. చేతల్లోకి వచ్చేసినట్లేనంటూ తెలంగాణ అధికారపక్ష నేతలు తరచూ చెప్పేస్తుంటారు. దీనికి తగ్గట్లే తెలంగాణ అధికారపక్షం సైతం రోజుకో ‘కొత్త’ ఆలోచనను చేస్తూ కనిపిస్తుంది.

అందులోభాగంగానే ఇప్పుడున్న సెక్రటేరియట్ ను కూలదోసి కొంగత్త డిజైన్లతో సరికొత్త సెక్రటేరియట్.. ఇప్పుడు ఓల్డ్ రవీంద్రభారతి స్థానంలో కొత్త రవీంద్రభారతి.. ఇప్పుడున్న సీఎం ఇంటికి బదులుగా కొత్త సీఎం అధికారిక నివాసంతో పాటు.. ఇలాంటివెన్నో కొత్త.. కొత్త ఆలోచనల్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు చేయటం తెలిసిందే. తాజాగా..ఆ జాబితాలోనే తెలంగాణ అసెంబ్లీ కూడా చేరనుంది. అప్పుడెప్పుడో కట్టిన అసెంబ్లీ భవనం ఏమిటి మరీ ఓల్డ్ గా అనుకున్న కేసీఆర్ అండ్ కో..కొత్త అసెంబ్లీ కట్టటానికి అవసరమైన జాగాను వెతికే పని మొదలెట్టారు.

ఈ కొత్తను కాసేపు పక్కన పెట్టి పాత లెక్కలోకి పోతే.. ఇప్పటికే ఉన్న రోడ్లకు గుంతలు పడి నిత్యం నగరజీవికి నరకం కనిపిస్తున్నా కేసీఆర్ సర్కారుకు అస్సలు పట్టదు. ముఖ్యమంత్రి కుమారుడు హైదరాబాద్ ను మార్చేస్తా.. మార్చేస్తా అంటూ గుంతల హైదరాబాద్ ను తయారుచేసేయటమే కాదు.. నిద్రపోతున్న అధికారగణాన్ని నిద్ర లేపేందుకు ఆయన నిద్రపోకుండా ఆకస్మిక తనిఖీలంటూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవటం గమనార్హం. గతంలో ముఖ్యమంత్రి.. ఆ స్థాయికి కాస్త కుడి ఎడంగా ఉన్న వాళ్లు ఎవరైనా సీరియస్ అయి.. అసలేం జరుగుతుంది.. చూప్ మంత్రకాళి మాదిరి మొత్తం పరిస్థితి మారిపోవాలని అగ్గి ఫైర్ అయితే.. మొత్తంగా మారిపోకున్నా.. మారినట్లుగా పైపైన పూతలైనా పూసేసి మురిపించేవాళ్లు.

ఇప్పుడా ‘షో’ కూడా లేని దుస్థితి. ముఖ్యమంత్రి కుమారుడే స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్ రోడ్ల మీద ఫైర్ అవుతున్నా.. ఎలాంటి మార్పు లేని పరిస్థితి. వారాలకు వారాలు గడుస్తున్నా పరిస్థితి మరింత దయనీయంగా మారటమే కానీ.. పనులు మాత్రం ముందుకు పడుతున్నది లేదు. ఇలా రోడ్లు.. మురికి కాల్వలు దరిద్రాన్ని మార్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కారు.. కొత్త అసెంబ్లీని కట్టేందుకు మాత్రం చాలా హుషారుగా పని చేస్తోంది.

వసతులు సరిగా లేవంటూ (అదేనండి.. వాస్తు సరిగా లేదని) అంత పెద్ద సెక్రటేరియట్ మొత్తాన్ని నేలమట్టం చేసేసి దాని స్థానే కొత్త సెక్రటేరియట్ కట్టేందుకు నడుం బిగించిన కేసీఆర్ సర్కారు.. తాజాగా అసెంబ్లీని కూడా మార్చేయాలని డిసైడ్ అయిపోయినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ భవనాన్ని నిర్మించేందుకు వీలుగా స్థలాన్ని వెతుకున్న తెలంగాణ సర్కారు వెతుకులాటకు ఫలితం లభించిందని చెబుతున్నారు.

కొత్తగా నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ అసెంబ్లీ భవనాన్ని ఎర్రమంజిల్ లోని జలసౌధ..రహదారులు – భవనాల శాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంగణాన్ని సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీతో పాటు శాసనమండలి భవనాన్ని కూడా అక్కడే నిర్మించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. పాత అసెంబ్లీ భవనాన్నిఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానాన్నితెలంగాణ సర్కారు సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. పాత అసెంబ్లీని మ్యూజియంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాలు సూత్రప్రాయంగా డిసైడ్ చేసిన ఈ ముచ్చటను తెలంగాణ సర్కారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.