Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల్లో తొలి రోజున పని చేసేదెవరు?

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:22 AM GMT
కొత్త జిల్లాల్లో తొలి రోజున పని చేసేదెవరు?
X
పెద్దగా దృష్టి సారించం కానీ.. కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అన్న వెంటనే కొందరు తెగ సంతోషపడుతుంటే.. మరి కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుకున్న జిల్లా ఏర్పాటు ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అయితే.. ప్రభుత్వం తాను నిర్ణయించుకున్న బాటలోనే నడుస్తూ.. కొత్త జిల్లాల ఏర్పాటు మీద వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం నెలకొంది. తొలుత 15 జిల్లాలుగా పేర్కొన్నా.. ఆ తర్వాత మరో రెండు జిల్లాల్ని అదనంగా చేర్చినా.. అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లే తప్పించి.. ఎవరో ఏదో సూచనతో చేయలేదన్న విషయాన్ని మర్చిపోలేం. మరి.. కొత్త జిల్లాల ఏర్పాటు దసరా పండగ రోజున అని ముహుర్తం కూడా డిసైడ్ అయిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దసరా రోజున ఏర్పడే కొత్త జిల్లాల్లో తొలి రోజున పని చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగుల.. ఇప్పుడున్న జిల్లాలకు పరిమితమయ్యారు. మరి.. కొత్త జిల్లాలకు ఉద్యోగుల్ని ఎలా ఎంపిక చేస్తారు? అన్నది ఒక ప్రశ్న అయితే.. తొలి రోజున ఎంతమంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానం లభిస్తుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కొత్తజిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు కసరత్తు మొదలైనా.. వారిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ మాత్రం కొత్తజిల్లాలు ఏర్పడిన తర్వాతి రోజు నుంచి పని చేస్తారు. ఇక.. జిల్లా ఏర్పడిన రోజున పని చేసేది ఇద్దరే ఇద్దరని చెబుతున్నారు. వారిలో ఒకరు సదరు జిల్లాకు కలెక్టర్ గా ఎంపిక చేసిన వారు.. మరొకరు ఆ జిల్లాలకు ఎంపిక చేసే జాయింట్ కలెక్టర్లు మాత్రమేనని చెబుతున్నారు. వారి వ్యక్తిగత సిబ్బంది వారి వెంట ఉండనే ఉంటారనుకోండి.

ఇక.. ఉద్యోగుల కేటాయింపులో భాగంగా అర్డర్ టు సర్వ్ ను జారీ చేస్తారు. అంటే.. ఉద్యోగులు తప్పనిసరిగా.. తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఎలాంటి ప్రశ్నలకు తావు లేకుండా ప్రభుత్వం చెప్పిన చోటు నుంచి పని చేయాల్సి ఉంటుంది.అంతేకాదు.. వారికి నిర్దేశించిన ప్రాంతంలో.. అప్పగించిన పనిని చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాకుంటే.. దీనికి సంబంధించిన సమాచారం సదరు ఉద్యోగులకు ముందస్తుగా సమాచారం ఇస్తారు. కాకుంటే.. మార్పులు.. చేర్పులకు ఏ మాత్రం అవకాశం ఉండదు.

మొదట అప్పగించిన పనిలో చేరిన తర్వాత వారి ఆప్షన్స్ ను పరిగణలోకి తీసుకొని.. పర్మినెంట్ పోస్టింగ్ ఇస్తారు. ఎప్పుడో కానీ చాలా అరుదుగా జరిగే ప్రక్రియ.. తెలంగాణ సర్కారు పుణ్యమా అని అందరూ ఈ విధానాన్ని చూసే వీలు కలగనుంది. కొత్త జిల్లాలుగా ఒకటో.. రెండో ఏర్పాటు చేస్తే ఈ కసరత్తు పరిమిత స్థాయిలో ఉంటుంది. కానీ.. ఉన్న పది జిల్లాలకు అదనంగా 17 జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు లాంటి భారీగా ప్రభావం చూపించే వీలుందని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే కొత్త జిల్లాల్లో తొలి రోజున ఇద్దరంటే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పని షురూ కావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.