Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల మ్యాప్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Aug 2016 12:24 PM GMT
కొత్త జిల్లాల మ్యాప్ వచ్చేసింది
X
ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునే దిశ‌గా, ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ స‌ర్కారు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే, దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల అయింది. ఈ దిశ‌గా మ‌రో ముందడుగు వేస్తూ శుక్ర‌వారం నాడు కొత్త జిల్లాలతో కూడిన మ్యాపును విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం. http://newdistrictsformation.telangana.gov.inలో కొత్త జిల్లాల రూపురేఖ‌ల‌ను చూసుకోవ‌చ్చు. ప్ర‌తిపాదించిన జిల్లాల్లో మండలాలు, రివెన్యూ డివిజ‌న్లు ఇత‌ర వివ‌రాల‌న్నీ డిస్ట్రిక్టుల వారీగా ఈ మ్యాపులో అందుబాటులో ఉంటాయి. అయితే, హైద‌రాబాద్ జిల్లాకు సంబంధించి ఎలాంటి స‌మాచార‌మూ ఇందులో ఇవ్వ‌లేదు. ఎందుకంటే, హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతానికి ఎలాంటి మార్పులూ లేవు కాబ‌ట్టి, తొమ్మిది జిల్లాల‌కు వేరువేరుగా నోటిఫికేష‌న్లు జారీ చేసింది ప్ర‌భుత్వం.

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ముసాయిదా నోటిఫికేష‌న్ ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజ‌న్లు, 490 మండ‌లాలు ఉన్నాయి. అభ్యంత‌రాల‌న్నీ ప‌రిశీలించి అక్టోబ‌ర్ 11 నాడు, అంటే ద‌స‌రా పండుగ‌నాడు అధికారికంగా కొత్త జిల్లాల‌తో కూడిన రాష్ట్ర ముఖ‌చిత్రాన్ని ఆవిష్క‌రిస్తారు. ఈలోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంత‌రాల‌ను ప్ర‌జ‌లు తెలియ‌జేసేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది ప్ర‌భుత్వం.

ఇంకోప‌క్క‌, ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అభ్యంత‌రాల‌ను స్వీక‌రించేందుకు ప్ర‌త్యేక పోర్ట‌ల్ కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 5వేల‌కు పైగా అభ్యంత‌రాల‌ను స్వీక‌రించారు. కొన్ని ప్రాంతాల‌ను కొత్త జిల్లాలు చెయ్యాల‌ని కోరుతుంటే... కొన్ని ప్రాంతాల‌ను కొత్త జిల్లా పేరుతో విభ‌జించ‌వ‌ద్ద‌న్న డిమాండ్లు కూడా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌న్మ‌కొండ‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయ‌డంపై స్థానికుల నుంచే అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌ద్వాల‌ను కొత్త జిల్లా కేంద్రంగా చేయాల‌న్న డిమాండ్ కూడా ఉంది. మొత్తానికి పెద్ద సంఖ్య‌లోనే అభ్యంత‌రాలు పేరుకుపోయే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటినీ ప‌రిష్క‌రించేందుకు చాలా స‌మ‌య‌మే కేటాయించాల్సి ఉంటుంది మ‌రి!